Himachal byelection : బిజెపి అభ్యర్థులుగా ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలు

చండీగఢ్‌ :   ఇటీవల నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను బిజెపి బరిలోకి దింపింది. ఆ ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలు హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు జూన్‌1న పోలింగ్‌ జరగనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన ఆ స్థానాలకు కూడా అదే రోజు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలు రాజీందర్‌ రాణా, సుధీర్‌ శర్మ, ఇందర్‌ దత్‌ లఖన్‌ పాల్‌, రవి ఠాకూర్‌, చైతన్య శర్మ, దేవీందర్‌ భుట్టోలు గతవారం బిజెపిలో చేరారు. వీరు సుజన్‌పూర్‌, ధర్మశాల, బర్సార్‌, లాహౌల్‌ -స్పితి, గాగ్రెట్‌ , కుట్లేహర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే నియోజకవర్గాల నుండి కాంగెస్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

➡️