మేయర్‌ ఎన్నికల్లోనే రిగ్గింగ్‌ చేస్తే…

Feb 3,2024 11:05 #Arvind Kejriwal, #elections
arvind kejriwal on mayor election
  • లోక్‌సభ ఎన్నికల్లో ఏం చేయగలదో ఊహించండి
  •  బిజెపిపై కేజ్రీవాల్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ : మేయర్‌ ఎన్నికల్లోనే బిజెపి రిగ్గింగ్‌ చేస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఏం చేయగలదో ఊహించుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం విమర్శించారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బిజెపి రిగ్గింగ్‌కు పాల్పడటం కెమెరాలో చిక్కిందని అన్నారు. ‘కొన్నేళ్లుగా ఎన్నికల్లో బిజెపి అక్రమాలకు పాల్పడుతుందని వింటున్నాం. ఇవిఎంలను ట్యాంపర్‌ చేయడం, ఓటరు జాబితాను తారుమారు చేయడం వంటి ఆరోపణలను వింటున్నాం. వీటికి ఆధారాలు దొరకలేదు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనలో పాల్గొనడానికి వస్తున్న తమ పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారని, కొంతమందిని నిర్బంధించారని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమం తరువాత ఆప్‌ కార్యాలయం నుంచి డిడియు మార్గ్‌లో ఉన్న బిజెపి ప్రధాన కార్యాలయం వద్దకు ప్రదర్శన నిర్వహించాలని ఆప్‌ నిర్ణయించుకుంది. పోలీసులు భారీగా మోహరించడంతోపాటు బారికేడ్లు ఏర్పాటుచేయడంతో ఆప్‌ కార్యకర్తలు అక్కడకు వెళ్లలేకపోయారు. మరోసారి ఇడి సమన్లను తిరస్కరించిన కేజ్రీవాల్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఇడి విచారణకు గైర్హాజరయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఇప్పటి వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. ఇడి సమన్లు చట్టవిరుద్ధమని, కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయడమే వారి ఏకైక లక్ష్యమని ఆప్‌ విమర్శించింది. శుక్రవారం కూడా కేజ్రీవాల్‌ ఇడి విచారణకు హాజరుకావడం లేదని ఆప్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటామని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని మోడీ లక్ష్యమని, దీనిని అనుమతించబోమని మండిపడింది. ఇడి సమన్లు రాజకీయ ప్రేరేపితమైనవని, చట్టవిరుద్ధమైనవని ఆప్‌ విమర్శించింది.

➡️