ఉత్తర భారత్‌లో బిజెపి గాలి లేదు : భూపేష్‌ బఘేల్‌

Mar 19,2024 23:53 #Bhupesh Baghel, #BJP, #in North India

న్యూఢిల్లీ : ఉత్తరభారత్‌లో బిజెపి గాలి లేదని, ఇండియా ఫోరానికే స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకులు భూపేష్‌ బఘేల్‌ తెలిపారు. అయోధ్య అంశం ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎకు 400కు పైగా స్థానాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బఘేల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఫోరానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికలు నరేంద్ర మోడీకి, యావత్‌ దేశానికి జరుగుతున్న పోరాటం అని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాల్లో సగానికిపైగా సీట్లను కాంగ్రెస్‌ సొంతం చేసుకుంటుందని తెలిపారు. ఉద్ధవ్‌థాకరే, ప్రకాష్‌ అంబేద్కర్‌ వంటి వారితో పాటు అనేక చిన్న పార్టీలు చేతులు కలపడంతో ఛత్తీస్‌గఢ్‌లో ఇండియా ఫోరం మరింత బలం పుంజుకుందన్నారు. మరోవైపు ఎన్‌డిఎ కూటమిలో విభేదాలు పెరుగుతున్నాయన్నారు. హార్యానా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌డిఎలో చీలికలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.

➡️