అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 10 మంది బిజెపి ఎంపిల రాజీనామా

Dec 6,2023 16:30 #BJP MPs, #Quit Parliament

న్యూఢిల్లీ :  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 12 మంది బిజెపి ఎంపిలలో పది మంది బుధవారం పార్లమెంటుకు రాజీనామా చేశారు. వీరిలో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌ సహా రితి పాఠక్‌, రాకేశ్‌ సింగ్‌, ఉదయ్  ప్రతాప్‌ సింగ్‌, రాజస్థాన్‌ నుండి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌, దియా కుమారి, ఛత్తీస్‌గఢ్‌ నుండి అరుణ్‌ సావో, గోమతి సాయి ఉన్నారు. వీరితో పాటు రాజ్యసభ ఎంపీ కిరోరిలాల్‌ మీనా కూడా రాజీనామా చేశారు. వీరు మంత్రి వర్గం నుండి కూడా వైదొలగనున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది ఎంపీలలో పది మంది ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డాను కలిసిన అనంతరం తమ రాజీనామా లేఖలను లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. రాజస్థాన్‌లోని అల్వార్  నుండి గెలుపొందిన బాబా బాలక్‌ నాథ్‌ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజాలో విజయం సాధించిన రేణుకా సింగ్‌లు కూడా త్వరలో రాజీనామా చేస్తారని మీడియాకు తెలిపారు. నేడు పార్లమెంటుకు రాజీనామా చేసిన బిజెపి నేతలు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రేసులో కూడా ఉన్నట్లు సమాచారం.

రాజీనామాలు విధానపరమైనవని వారు పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా మరియు పార్లమెంటు సభ్యునిగా కొనసాగేందుకు రాజ్యాంగం అనుమతించదు. తాను ఎంపి పదవికి రాజీనామా చేశానని, త్వరలో మంత్రివర్గానికి కూడా రాజీనామా చేస్తానని ప్రస్తుతం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో బిజెపి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

➡️