మానవ అక్రమ రవాణా కేసులో బిజెపి కార్యకర్త అరెస్టు

Jul 3,2024 00:07 #arest, #BJP, #Case, #human trafficking, #leader

కొల్‌కతా : మానవ అక్రమ రవాణా కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి యువజన విభాగం కార్యకర్త బిక్రమ్‌ రారును ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలతో బంగ్లాదేశీయులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు బిక్రమ్‌ రారు సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగాణాలోని బాగ్దాలో నివాసంలో బిక్రమ్‌ రారును స్థానిక పోలీసులు సహాయంతో లక్నో యాంటీ టెర్రిరిస్టు స్క్వాడ్‌ (ఎటిఎస్‌) అరెస్టు చేసింది. ‘భారత్‌లోకి అక్రమంగా అనేకసార్లు ప్రవేశించిన బంగ్లాదేశ్‌ జాతీయుడితో బిక్రమ్‌ రారు ఫోన్‌లో సంభాషించడాన్ని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ట్రాక్‌ చేశారు. తరువాత అరెస్టు చేశారు’ అని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ఐపిసి సెక్షన్లు 419, 420, 467, 471, 120బి కింద ఫోర్జరీ, మానవ అక్రమ రవాణా, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలను బిక్రమ్‌ రారుపై నమోదు చేశారు. బొంగావ్‌ కోర్టులో హాజరు పర్చిన లక్నో పోలీసులు ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం బాగ్దా బ్లాక్‌లో బిజెపి యువ మోర్చా కార్యదర్శిగా పని చేస్తున్నాడు. కాగా, ఇటీవల అగర్తల రైల్వేస్టేషన్‌లో అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో కొనసాగుతున్న అక్రమ వలస సమస్యను మరోసారి బహిర్గతం చేసింది.

➡️