ట్రక్కును ఢీకొట్టిన బస్సు – నలుగురు మృతి

అయోధ్య : రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కుని బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన సోమవారం పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది. అయోధ్య నుంచి వస్తున్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వేపై బరేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముస్సేపూర్‌ గ్రామ సమీపంలో ఆగి ఉన్న హైవే (ట్రక్కు)ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించబడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే మౌ, ఘాజీపూర్‌ జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరగడంతో అక్కడ క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. వారి కేకలు విన్న సమీపంలో జనం గుమిగూడారు. ఇంతలో పోలీసు బృందం సహాయంతో, వాహనాలను హైవేపై నుండి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. బస్సులో పలు ప్రాంతాలకు చెందిన 25 మంది అయోధ్యను సందర్శించి తిరిగి వస్తున్నారు. వీరంతా బీహార్‌లోని విక్రమ్‌గంజ్‌కు వెళుతున్నట్లు సమాచారం. ఉదయం 5 గంటలకు బరేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముస్సేపూర్‌ గ్రామ సమీపంలోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. గాయపడినవారందరినీ మౌ, ఘాజీపూర్‌ జిల్లా ఆసుపత్రులకు తరలించినట్లు రూరల్‌ అదనపు సూపరింటెండెంట్‌ బల్వంత్‌ చౌదరి తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతులను గుర్తిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️