ఎన్నికల ముంగిట అమల్లోకి సిఎఎ

Mar 12,2024 08:53 #CAA, #elections
  • నోటిఫై చేసిన కేంద్రం
  • అమలుచేయబోమన్న కేరళ
  • అదే బాటలో మరో నాలుగు రాష్ట్రాలు

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) మళ్లీ తెరపైకి తెచ్చింది. వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాల వ్యతిరేకత మధ్య ఈ వివక్షాపూరిత చట్టం అమలుకు నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫై చేసింది. కేరళతో సహా అయిదు రాష్ట్రాలు ఈ పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే సిఎఎను అమలులోకి తెస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవలే హూంకరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ముందే కేంద్రం సవరించిన సిఎఎ నిబంధనలను నోటిఫై చేయడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు. ఫాసిస్టు హిందూత్వను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దుర్బుద్ధితోనే అది ఈ పని చేసింది ముస్లింల పట్ల వివక్ష చూపే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబరు 11న పార్లమెంటులో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామికమైన రీతిలో ఆమోదింప జేసుకుంది. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబరు31 లేదా అంతకుముందు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి భారత దేశానికి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది. ముస్లింలను మాత్రం పరిగణనలోకి తీసుకోరు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తాయి. . రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలు, వారికి మద్దతుగా ప్రగతిశీల శక్తు లు నిరసనలు చేపట్టాయి. దీంతో వెనక్కి తగ్గిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముంగిట మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. కూడుకున్న చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నోటిఫై చేసిన సిఎఎ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

                                                                               పలుచోట్ల భద్రత కట్టుదిట్టం

సిఎఎను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లోని పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈశాన్య ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌, జామియా, ఇతర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను కొన్ని చోట్ల మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది, పారామిలటరీ బలగాల ద్వారా పెట్రోలింగ్‌, చెకింగ్‌ నిర్వహిస్తున్నారు.

                                                                        భగ్గుమన్న జామియా మిలియా

న్యూఢిల్లీ : సిఎఎ నిబంధనల నోటిఫైని వ్యతిరేకిస్తూ జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్‌లో నిరసనలు పెల్లుబికాయి. ముస్లిం స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నేతృత్వంలో విద్యార్థులు ఈ నిరసనలకు దిగారు. వీరికి ఉపాధ్యాయులు కూడా మద్దతు తెలిపాయి. ఢిల్లీ పోలీసులకు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) కూడా ఈ నిరసనలకు మద్దతు తెలిపింది. ‘రాజ్యాంగ విరుద్ధమైన సిఎఎను అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌యుఐ జామియా మిలియా ఇస్లామియా నిరసన తెలుపుతుంది’ అని ఎన్‌ఎస్‌యుఐ యొక్క జామియా యూనిట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో క్యాంపస్‌లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. జామియా యాక్టింగ్‌ వైస్‌-ఛాన్సలర్‌ ఎక్బాల్‌ హుస్సేన్‌ మీడియాతో మాట్లాడుతూ, ”క్యాంపస్‌లో ఎలాంటి ఆందోళనలు అనుమతించం. అలాగే బయటి వ్యక్తులను క్యాంపస్‌ సమీపంలోకి అనుమతించర’ అని చెప్పారు.

➡️