రంగు పడుద్ది!

Apr 14,2024 23:50 #Color it!

– లోక్‌సభ ఎన్నికలకు సిరా సిద్ధం
– కర్ణాటక పిఎస్‌యు తయారీ
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :లోక్‌సభ ఎన్నికలకు చెరగని సిరా సిద్ధంగా ఉంది. మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ (ఎంపివిఎల్‌) తయారుచేసే ఇంక్‌ ను దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఎంపివిఎల్‌ 1962 నుండి ఎన్నికల సంఘం కోసం ఈ ఇంక్‌ను తయారు చేస్తోంది. దేశంలో అత్యధికంగా 80 లోక్‌సభ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా సిరా సరఫరా చేశారు. ఒకే ఓటరు బహుళ ఓటింగ్‌ను నిరోధించడానికి ఎడమ చేతి చూపుడు వేలుకు ముదురు ఊదా రంగు గుర్తును ఉంచే ఇంక్‌ రాస్తారు. ఈ సిరాను 25 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
లక్షద్వీప్‌కు అత్యల్పం
2024 సార్వత్రిక ఎన్నికలకు రూ. 55 కోట్ల ఖర్చుతో 26.55 లక్షల (వయల్స్‌ సంఖ్య) బాటిల్స్‌ చేశారు. అదే 2019లో రూ. 36 కోట్లతో 25.98 లక్షల బాటిల్స్‌ సరఫరా చేశారు. ఉత్తరప్రదేశ్‌ కి 2024లో రూ.15.30 కోట్లతో 3.58 లక్షల వయల్స్‌, 2019 14.59 కోట్లతో 3.64 లక్షల వయల్స్‌ సరఫరా చేశారు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓటర్లు ఉన్న లక్షద్వీప్‌కు అత్యల్పంగా సిరాను సరఫరా చేశారు. 110 వయల్స్‌ సరఫరా చేశారు.
700 మందికొక బాటిల్‌
700 మంది ఓటర్ల వేళ్లను ఒక వయల్స్‌ వాడుతారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వాటిలో 26.55 లక్షల ఇంక్‌ వయల్స్‌ వాడుతున్నారు. మహారాష్ట్ర 2.68 లక్షలు, పశ్చిమ బెంగాల్‌ 2 లక్షలు, బీహార్‌ 1.93 లక్షలు, తమిళనాడు 1.75 లక్షలు, తెలంగాణ 1.50 లక్షలు, మధ్యప్రదేశ్‌ 1.52 లక్షలు, కర్ణాటక 1.32 లక్షలు, రాజస్థాన్‌ 1.30 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ 1.16 లక్షలు, గుజరాత్‌ 1.13 లక్షలు, కేరళ 63 వేలు, పంజాబ్‌ 55 వేలు,, హర్యానా 42 వేలు, ఢిల్లీ 35 వేలు,, జమ్మూ కాశ్మీర్‌ 30 వేలు, జార్ఖండ్‌ 1.30 లక్షలు, మణిపూర్‌ 75,380 వయల్స్‌ ను పంపించారు. ఇదిలా ఉండగా ఎంపివిఎల్‌ సంప్రదాయ సీసాకు ప్రత్యామ్నాయంగా మార్కర్‌ పెన్నును అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోంది. చెరగని సిరా తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్ధమైన సిల్వర్‌ నైట్రేట్‌ ధరలో హెచ్చుతగ్గుల కారణంగా గత ఎన్నికల్లోనే సీసా ధర రూ.160 ఉండగా ఇప్పుడు అది కాస్తా రూ.174కి పెరిగింది.

➡️