బల పరీక్షలో పాల్గొనవచ్చు-హేమంత్‌ సోరేన్‌కు ప్రత్యేక కోర్టు అనుమతి

Feb 4,2024 08:33 #Hemant Soren

రాంచి : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ ఈ నెల 5న అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు రాంచిలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్‌ కేసులో జనవరి 31న ఇడి సోరేన్‌ను అరెస్టు చేసింది. శుక్రవారం ఐదు రోజుల పాటు ఇడి కస్టడీకి పంపింది. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టులో సోరేన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను అసెంబ్లీ సభ్యుడినని, ప్రత్యేక సమావేశంలో పాల్గొనేందుకు తనకు హక్కు వుందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇడి అభ్యంతరం తెలపడంలో అర్థం లేదు : అడ్వకేట్‌ జనరల్‌

అడ్వకేట్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మీడియాతో మాట్లాడుతూ హేమంత్‌ సోరేన్‌ పిటిషన్‌కు ఇడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవడమే ఇడి ఉద్దేశంగా వుందని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు విషయంలో ఆయన జోక్యం చేసుకోనప్పుడు అసెంబ్లీ కార్యకలాపాలకు అభ్యంతరం తెలియజేయడంలో అర్థం లేదన్నారు. అందువల్లే కోర్టు తమ పిటిషన్‌ను ఆమోదించి, అనుమతి మంజూరు చేసిందని చెప్పారు.

➡️