నోయిడాలో మళ్లీ కోవిడ్‌

Dec 23,2023 10:55 #Covid Cases

నొయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లా నొయిడాలో చాలా నెలల తరువాత మొదటి కోవిడ్‌-19 కేసు నమోదయింది. నోయిడా వాసికి కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. గుర్గావ్‌లోనిసెక్టార్‌ 36లో ఉంటున్న 54 ఏళ్ల ఈ రోగి ఒక బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నాడని గౌతమ్‌ బుద్ధ నగర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సునీల్‌ శర్మ గురువారం తెలిపారు. ప్రస్తుతం అతనిని హౌమ్‌ ఐసోలేషన్‌లో ఉంచామని, రోగి నమూనాను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఢిల్లీకి పంపామని, ఫలితం కోసం వేచి చూస్తున్నామని వైద్య అధికారి తెలిపారు. జిల్లా నిఘా అధికారి, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్‌ అమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, రోగి ఈ నెల ప్రారంభంలో నేపాల్‌కు వెళ్లి, తిరిగి వచ్చిన తర్వాత గుర్గావ్‌ కార్యాలయంలో విధులకు హాజరయ్యాడని తెలిపారు. కోవిడ్‌-19 సబ్‌వేరియంట్‌ సాధారణ లక్షణాలు గొంతు నొప్పి, నీరసం, తలనొప్పి వంటివని డాక్టర్‌ అమిత్‌ కుమార్‌ తెలిపారు. నోయిడాను ఆనుకుని వున్న ఘజియాబాద్‌లో 3 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పౌరులు కోవిడ్‌ -19 ప్రోటోకాల్‌ను పాటించాలని, ఫేస్‌ మాస్క్‌లు ధరించాలని, హ్యాండ్‌ శానిటైజర్‌లను ఉపయోగించాలని ఆరోగ్య శాఖ కోరింది. భారత్‌లో మరోసారి కోవిడ్‌ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జెఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాపంగా గురువారం 594 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం తెలిపింది. దీంతో దేశంలో క్రియాశీల కేసులు 2,311 నుండి 2,669కి పెరిగాయి. అలాగే గురువారం కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరు సహా మొత్తం ఆరుగురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 5,33,327కి చేరింది.

➡️