ఎస్‌బిఐపై సిపిఎం కోర్టు ధిక్కార పిటిషన్‌

Mar 11,2024 10:51

న్యూఢిల్లీ : మార్చి 6తో ఎలక్టోరల్‌ బాండ్‌ సమాచారాన్ని అందించే గడువు ముగియడంతో ఎస్‌బిఐకి వ్యతిరేకంగా సిపిఐ(ఎం) కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోర్టును ఆశ్రయించారు. సమాచారం ఇచ్చేందుకు కోర్టు విధించిన కాలపరిమితిని ఎస్‌బిఐ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఆర్డర్‌లో పేర్కొనని అంశాల కారణంగా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, తప్పుడు బాష్యాలు చెప్పడం వంటివి చేస్తోందని, బాండ్లను కొనుగోలు చేసిన వారు, వాటిని మార్చిన వారి సమాచారం సరిపోలాలని కోర్టు ఆదేశించలేదు. కానీ ఈ చెప్పని విషయాన్ని ముందుకు తెచ్చి ప్రాక్టికల్‌ ఇబ్బంది ఉందని చెప్పి కాలయాపన చేస్తున్నారు. బాండ్‌ కొనుగోలుదారులు, వాటిని క్యాష్‌ చేసిన వారి గురించి సమాచారాన్ని అందించడంలో అమలు చేయదగిన నిషేధం ఉందని కేసులో ఏ సమయంలోనూ ఎస్‌బిఐ పేర్కొనలేదు. ఒక్క క్లిక్‌తో సమాచారం మొత్తం అందుబాటులోకి వచ్చేసేదానికి బ్యాంకు కోర్టును అయోమయానికి గురిచేస్తోంది. ఇది కోర్టు ధిక్కారమేనని సిపిఎం పేర్కొంది. గడువును మూడున్నర నెలలు పొడిగించాలని కోరుతూ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టనుంది.

➡️