సిపిఎం త్రిస్సూర్‌ బ్యాంక్‌ ఖాతా స్తంభన- ఐటి అధికారులు

ప్రజాశక్తి ప్రతినిధి – తిరువనంతపురం :కేరళలోని త్రిస్సూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి ప్రయోజనార్థం.. సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు స్తంభింపచేశారు. పార్టీకి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంజి రోడ్‌లోని జిల్లా కమిటీ అకౌంట్‌ను స్తంభింపచేసినట్లు ఆ నోటీసులో తెలియచేశారు. దానికి గల కారణమేంటనేది ఆ నోటీసులో వారు వివరించలేదు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించరాదని ఆ నోటీసు పేర్కొంది. ఈ ఖాతా వివరాలు పరిశీలించేందుకు శుక్రవారం రాత్రి ఐటి అధికారులు బ్యాంక్‌ ఎంజి రోడ్‌ బ్రాంచికి చేరుకున్నారు. అదే సమయంలో జిల్లా కమిటీ కార్యదర్శిని కూడా బ్రాంచికి రావాల్సిందిగా పిలిపించారు. అంతకుముందు రోజే కోచిలో జిల్లా కార్యదర్శి ఎం.ఎం.వర్గీస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఇంటరాగేట్‌ చేశారు. కరవన్నూర్‌ సర్వీస్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌కు సంబంధించిన సమస్యలకు సంబంధించి ఇంటరాగేషన్‌ జరిగింది. ఖాతా వివరాలను ఇడి అధికారలు అడిగి తెలుసుకున్నారు.
ఐటి శాఖ చర్యలు తీవ్రంగా ఖండించదగ్గవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రతి సంవత్సరం పార్టీ ఆదాయ, ఖర్చుల వివరాలను ఆదాయపన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు సిపిఎం అందచేస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. అలాగే త్రిస్సూర్‌ జిల్లా కమిటీ అకౌంట్‌ వివరాలను కూడా తెలియచేశామన్నారు. ముందస్తు సమాచారం, ఎలాంటి వివరణ లేకుండా అకౌంట్‌ను స్తంభింపచేశారని కార్యదర్శివర్గం విమర్శించింది. త్రిస్సూర్‌ జిల్లాలో సహకార బ్యాంకులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నిర్దిష్ట వైఖరి తీసుకుంటూ వస్తోందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలను, ప్రతిపక్ష పార్టీలను వెంటాడి, వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానంలో భాగమే ఈ చర్యలని కార్యదర్శివర్గం విమర్శించింది. ఈ ఎన్నికల క్రమంలో మరింత చురుకుగా పాల్గనాల్సిందిగా, ఈ విధానాలపై పోరాడాల్సిందిగా కేరళ ప్రజలను కార్యదర్శివర్గం ఆ ప్రకటనలో కోరింది.

➡️