మోడీ రామరాజ్యంలోనే దళితులపై వివక్ష : రాహుల్‌ గాంధీ

Feb 21,2024 17:15 #PM Modi, #Rahul Gandhi

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ పేర్కొనే రామరాజ్యంలోనే దళితులు, వెనుకబడిన తరగులపై వివక్ష కొనసాగుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశ మొత్తం జనాభాలో 90 శాతంగా ఉన్న మైనారిటీలు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతులకు ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. రాహుల్‌ చేపడుతున్న భారత్‌ జోడో న్యారుయాత్ర బుధవారం కాన్పూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ” దేశంలో 50 శాతం జనాభా వెనుకబడిన తరగతులకు చెందినవారు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలు ఉన్నారు. మీరు ఎంత పోరాడినా ఈ దేశంలో ఉపాధి పొందలేరు” అని అన్నారు.

”కొన్ని సార్లు ప్రశ్నాపత్రాలు లీక్‌ అవుతాయని, ఉద్యోగాల నుండి తొలగిస్తారు, జిఎస్‌టి విధిస్తారు, నోట్లరద్దు విధిస్తారు. కానీ ఉద్యోగాల భర్తీ మాత్రం జరగదు. మీరు సైన్యంలో చేరే మార్గాన్ని కూడా అగ్నివీర్‌ యోజన పేరుతో మూసివేశారు” అని అన్నారు. ”అయోధ్యలో రాముని వేడుకను చూడండి. వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు ఎంత మంది ఉన్నారు. గిరిజన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముకి కూడా ఆహ్వానం అందలేదు. దళిత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కూడా లోపలికి అనుమతించలేదు ” అని అన్నారు. కులగణన సర్వేతో మాత్రమే దేశంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధ్యమవుతుందని కాంగ్రెస్‌, ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రస్తావించారు.

➡️