ఊపిరి పీల్చుకుంటే… పొగ పీల్చుతున్నట్టుందంటున్న ఢిల్లీవాసులు

Nov 17,2023 12:36 #Delhi, #Pollution

 

న్యూఢిల్లీ : దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత రోజురోజుకీ పడిపోతుందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో కూడా పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని ఐఎండి వెల్లడించింది. ఇక శుక్రవారం ఉదయం ఎక్యూఐ (గాలి నాణ్యతా సూచీ) రికార్డుస్థాయిలో అత్యధికంగా 404గా నమోదైంది. దీంతో ఢిల్లీవాసులు ఊపిరి పీల్చుకుంటుంటే.. పొగను పీల్చుతున్నట్టుగా ఉందని వాపోయారు. రోడ్డుపైకి వెళితే.. పొగతో దారి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. త్వరితగతిన కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్‌ ప్రభుత్వం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. రెండు స్మోగ్‌ టవర్లను ఏర్పాటు చేసింది. అయితే వాటితో కూడా కాలుష్యాన్ని తగ్గించలేకపోయినట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కి తెలిపింది. వీటితో కాలుష్యం తగ్గకపోగా.. వాటి నిర్వహణకయ్యే ఖర్చు భారీ స్థాయిలో అవుతుందని ఈ కమిటీ పేర్కొంది.
కాగా, గురువారం 419, బుధవారం 401, మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా గాలి నాణ్యతలు నమోదయ్యాయి. రోజురోజుకీ పడిపోతున్న గాలి నాణ్యతతోపాటు.. దీపావళి టపాసులు వల్ల కూడా అక్కడ గాలి కాలుష్యం మరింత తీవ్రమైంది.

➡️