ఢిల్లీ సీట్ల పంపకం కొలిక్కి..!

Feb 23,2024 10:11 #Delhi, #Delivery, #seats
  • ఆప్‌ నాలుగు.. కాంగ్రెస్‌ మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ
  • మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా..
  • త్వరలో ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ : ఇండియా వేదికలో భాగస్వాములైన కాంగ్రెస్‌, సమాజ్‌ వాది పార్టీల మధ్య యుపి, మధ్య ప్రదేశ్‌లలో సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఢిల్లీ, మరో నాలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఒప్పందమే కుదిరింది. ఇండియా ఫోరమ్‌ మిత్రుల మధ్య విభేదాలు తొలగి ఏక తాటిపైకి వస్తున్నాయడానికి ఇదొక మంచి సంకేతం. గత కొన్ని రోజులుగా చర్చోప చర్చల తరువాత ఢిల్లీలో నాలగు స్థానాల్లో ఆప్‌, మిగతా మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలని నిర్ణయించాయి. అలాగే హర్యానా, గుజరాత్‌, గోవా, అస్సాంలలో కూడా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుండి. గురువారం నాడిక్కడ ఆప్‌, కాంగ్రెస్‌ నేతలు సమావేశమై ఏయే స్థానాల్లో ఎవరెవరికి అనే దానిపై నిర్దిష్టంగా ఒక అంగీకారానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఆప్‌ దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెడుతుందని, కాంగ్రెస్‌ చాందినీ చౌక్‌, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఆప్‌ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో పొత్తు పెట్టుకోవటాన్ని తమ రాష్ట్ర నాయకులు వ్యతిరేకిస్తున్నందున తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్‌, కాంగ్రెస్‌లు ఇప్పటికే ప్రకటించాయి. పంజాబ్‌లో ఆప్‌ అధికారంలో ఉన్న విషయం విదితమే. ”పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసేందుకు పరస్పరం అంగీకరించాయి. గుజరాత్‌లో రెండు ఎంపీ స్థానాలు, అస్సాంలో ఒకటి, గోవాలో ఒక స్థానం ఆప్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. హర్యానాలో కూడా ఆప్‌కు కొన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆప్‌ ఓట్ల వాటా 18.1 శాతంగా ఉన్నది. ఆప్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ 22.5 శాతం ఓట్లను సాధించి, ఏడు లోక్‌సభ స్థానాల్లో ఐదింటిలో రెండవ స్థానంలో నిలిచింది. బీజేపీకి 56.5 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.

➡️