అసమానతలు.. అరకొర వేతనాలు

Jun 16,2024 23:35 #Inequalities, #Low wages

అసంఘటిత రంగంలో 11 కోట్ల మంది కార్మికులు
దశాబ్దం తర్వాత తొలిసారి సమాచారాన్నిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : అనధికారిక లేదా చట్టబద్ధంగా ఏర్పడని సంస్థల్లో అసమానతలు, చాలీచాలని అరకొర వేతనాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న సంస్థల వార్షిక సర్వే (ఎఎస్‌యుఎస్‌ఇ) తాజా నివేదిక ప్రకారం మన దేశంలో ఆరున్నర కోట్ల అనధికారిక లేదా చట్టబద్ధంగా ఏర్పడని సంస్థలు ఉన్నాయి. వీటిలో 2022-23లో 11 కోట్ల మంది కార్మికులు పనిచేశారు. ఈ సంస్థలన్నీ కలిపి ఆ ఏడాది రూ.15.4 లక్షల కోట్ల విలువైన స్థూల విలువ ఆధారిత (జివిఎ) వస్తువులు, సేవలను ఉత్పత్తి చేశాయి. వ్యవసాయం కాకుండా అనియత రంగంలో జివిఎ, ఉపాధి వాటా వరుసగా 6%, 19%గా ఉన్నాయి. మొత్తంగా జివిఎలో వ్యవసాయానికి సంబంధించి ఉపాధి వాటా 45%, ఆదాయ వాటా 18% ఉంటుందని భావిస్తే మూడింట రెండు వంతుల మంది కార్మికులు జివిఎలో కేవలం నాలుగో వంతు మాత్రమే భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్రంగా పాతుకుపోయిన అసమానతలకు అద్దం పడుతోంది.
2021-22, 2022-23 సంవత్సరాలకు సంబంధించి చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న సంస్థల వార్షిక సర్వే (ఎఎస్‌యుఎస్‌ఇ) ఈ విషయాలను బయటపెట్టింది. జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థ దీనిని నిర్వహించింది. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) సంఖ్యలు సహా అనేక గణాంకాలను తాజా పరిచేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. పూర్తిస్థాయి నివేదిక ఇంకా బహిర్గతం కానప్పటికీ ఇవి ప్రాథమికంగా తెలిసిన వివరాలు.
2022 జూన్‌ – 2023 జూన్‌ మధ్యకాలంలో నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం 2022-23లో దేశంలో 56.7 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో చట్టబద్ధం కాని సంస్థల్లో పనిచేసిన వారు 11 కోట్ల మంది… అంటే 20శాతం మంది మాత్రమేనని తాజా గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయం, నిర్మాణం మినహా చటబద్ధంగా ఏర్పడని మిగిలిన రంగాల్లో అసమానతలు, చాలీచాలని అరకొర వేతనాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని కూడా తాజా నివేదిక నొక్కి చెప్పింది. ఈ రెండు రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థలో తక్కువ ఆదాయాన్ని అందించే ఉపాధిని కల్పిస్తున్నాయి. తాజా నివేదిక నిర్మాణ రంగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉత్పత్తి, వాణిజ్యం, ఇతర సేవల రంగాలను మాత్రమే గమనంలోకి తీసుకుంది.
అసంఘటిత రంగానికి సంబంధించిన సమాచారం దశాబ్ద కాలానికి పైగా అందుబాటులో లేదు. దీంతో ఆ ప్రభావం జిడిపి సంఖ్యలతో మొదలుకొని అన్ని ఆర్థిక వ్యవస్థల సమాచారానికి సంబంధించిన విశ్వసనీయతపై పడిందని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిమాన్షు తెలిపారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రంగాల వారీగా పారదర్శకంగా పూర్తిస్థాయి నివేదికను విడుదల చేయాలని, అందరి అభిప్రాయాలను విస్తృత స్థాయిలో వినాలని కోరారు. ఆ తర్వాతే ఇతర గణాంకాల సమాచారాన్ని నవీకరించాలని సూచించారు. అప్పుడే భారత గణాంక వ్యవస్థ విశ్వసనీయత పునరుద్ధరించబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

➡️