గడువుతీరినా .. టోల్‌ ప్లాజాలను తొలగించం

Dec 23,2023 10:49 #toll plazas

న్యూఢిల్లీ : నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత.. లేదా మూలధన వ్యయాన్ని రికవరీ అయిన తరువాత కూడా.. టోల్‌ ప్లాజాలను తొలగించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అలాగే, దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్‌ ప్లాజాలోనూ ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని మంత్రి చెప్పారు. సాధారణంగా మనలో చాలామంది నిర్ణీత గడువు తర్వాత టోల్‌ప్లాజాలను మారుస్తారు లేదా తొలగిస్తారని అనుకుంటారు. అయితే జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు-2008 ప్రకారం.. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్‌ ప్లాజాలను తొలగించాలనే ఎలాంటి నిబంధనా లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించారు.దేశంలో రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు నిర్మాణానికి చేసిన ఖర్చును టోల్‌ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది.మరోవైపు, జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల వసూలుకు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.

➡️