అడవిపై గొడ్డలి వేటు!

Jan 1,2024 08:18 #mining

ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీ ప్రాంతాల్లో బొగ్గు మైనింగ్‌

అదానీ కంపెనీలకు 370 కోట్ల టన్నుల నిక్షేపాల అప్పగింతకు బిజెపి ఆత్రం

మన్యం బిడ్డలకు, పర్యావరణవేత్తలకు తొలి గిరిజన సిఎం హయాంలో బెదిరింపులు

రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బిజెపి అదానీ కంపెనీలకు బొగ్గు నిక్షేపాలను కట్టబెట్టేందుకు ఆత్రం ప్రదర్శిస్తోంది. ఆదివాసీ ప్రాంతాల్లోబొగ్గు తవ్వకాలకు అనుమతి ఇస్తోంది. దీనిపై గిరిజనులు, పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. డిసెంబర్‌ 21న డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాత టిజి అజరుని, అటవీ వనరుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఛత్తీస్‌గఢ్‌ బచావో ఆందోళన్‌ కన్వీనర్‌ అలోక్‌ శుక్లాను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఆ సాయంత్రమే వారిని విడిచిపెట్టారు. గిరిజనుల ప్రభావం ఎక్కువగా ఉన్న సర్‌గుజా జిల్లాలో కొందరు అటవీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. రాష్ట్రంలో జీవవైవిధ్య ప్రాంతమైన హస్‌దియో అరంద్‌లో జరుగుతున్న అడవుల నరికివేత పనులను అడ్డుకోవద్దంటూ పోలీసులు గ్రామస్తులను బెదిరింపులకు గురిచేశారు. గ్రామస్తుల నోరు మూయించేందుకే వారిని నిర్బంధించారంటూ వచ్చిన వార్తలను పోలీసులు తోసిపుచ్చినప్పటికీ ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో కార్పొరేట్‌ రాజ్‌ ప్రారంభానికి ఓ సంకేతమని పలువురు వ్యాఖ్యానించారు. వివాదాస్పద అటవీ భూములు మూడు జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ మద్దతున్న మైనింగ్‌ కంపెనీలు కన్నేశాయి. ప్రధానంగా అదానీ గ్రూపు రంగంలో దిగింది. రాష్ట్రంలోని 3.7 బిలియన్‌ టన్నుల బగ్గు నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ఆ గ్రూపు లక్ష్యంగా పెట్టుకుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం 2022లో 41 హెక్టార్ల విస్తీర్ణంలోని చెట్లను కూల్చివేశారు. 2023 నవంబరులో మరో 93 హెక్టార్లలో చెట్ల కూల్చివేతకు అనుమతులు ఇచ్చారు.ఇటీవల బిజెపి గెలుపొందడంతో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత నెల 13న విష్ణుదేవ్‌ సాయి బాధ్యతలు చేపట్టారు. ఆ నాటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చెట్ల నరికివేత పనులు నిరాటంకంగా సాగిపోతున్నాయి. గత సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ చెట్ల నరికివేతను నిరసిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. అడవుల నరికివేతపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పైగా దేవ్‌ సాయి రాష్ట్రానికి తొలి గిరిజన ముఖ్యమంత్రి. బొగ్గు తవ్వకం, చెట్ల నరికివేత గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేనని, ఇప్పుడు జరుగుతున్న పనులు వాటికి కొనసాగింపేనని ఆయన వివరణ ఇస్తున్నారు. ఆదివాసీల నిర్బంధం చట్టవిరుద్ధంఆదివాసీల నిర్బంధం చట్టవిరుద్ధం, ప్రమాదకరమని ఛత్తీస్‌గఢ్‌ బచావో ఆందోళన్‌ కన్వీనర్‌ అలోక్‌ శుక్లా వ్యాఖ్యానించారు. నిరసన గళం విన్పించిన అనేక మందిని నిర్బంధించారని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాలలో అయితే పోలీసులు వారిని బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా ఇళ్ల నుండి తీసుకెళ్లారని తెలిపారు. నవంబర్‌ 28న శుక్లా నేతృత్వంలో రాజధాని రారుపూర్‌లో నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు మెమొరాండాలు అందజేశారు. ఆదివాసీల హక్కుల రక్షణలో జోక్యం చేసుకోవాలని వాటిలో కోరారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో సర్‌గుజా జిల్లాలోని మొత్తం 14 స్థానాలనూ బిజెపియే గెలుచుకుంది. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పలు గ్రామాలలో గ్రామసభలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ అటవీ భూమిని తవ్వకాలకు ధారాదత్తం చేశారు. కొన్ని గ్రామ సభలను మైనింగ్‌ కంపెనీలే నిర్వహించి తీర్మానాలు ఆమోదించాయి. వాటిపై గత గవర్నర్‌ విచారణకు ఆదేశించారు కూడా. అయినప్పటికీ పోలీసు రక్షణలో మైనింగ్‌ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

➡️