పశ్చిమ బెంగాల్‌ డిజిపి సహా ఆరు రాష్ట్రాల ఉన్నతాధికారులను తొలగించిన ఇసి

 కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ డిజిపి సహా ఆరు రాష్ట్రాల ఉన్నతాధికారులను   భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) సోమవారం  తొలగించింది.  పశ్చిమ బెంగాల్ డిజిపిని  ఎన్నికల సంబంధిత విధులకు బదిలీ చేయాల్సిందిగా ఇసిఐ   రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీకి ఉత్తర్వులు పంపింది.   ఆ పదవిని భర్తీ చేసే వరకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని సీనియర్‌ అధికారికి ఆ విథులను అప్పగించాలని ఆదేశించింది. సోమవారం సాయంత్రం 5.00 గంటల లోపు డిజిపి పదవికి అర్హులైన అధికారుల జాబితాను పంపాలని ఆదేశించింది.

 ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల తొలగింపు 

అలాగే    గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను కూడా  తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బృహన్  ముంబయి మున్సిపల్‌ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చాహల్‌తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లను తొలగించింది.  మిజోరం, హిమాచల్‌ ప్రదేశ్‌ల సాధారణ పరిపాలనా విభాగాల కార్యదర్శులను కూడా తొలగించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

ఎలక్షన్‌ కమిషన్‌ చీఫ్‌ రాజీవ్‌ కుమార్‌  ఇతర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కూడిన కమిషన్‌ సోమవారం భేటీ అయిన అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.   లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్‌ కమిషన్‌ ఈవిధమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

 

➡️