అక్రమ వలసల రాకెట్‌ కేసులో మూడు రాష్ట్రాల్లో ఇడి సోదాలు

న్యూఢిల్లీ :    అక్రమ వలసల రాకెట్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) బుధవారం గుజరాత్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఏకకాలంలో దాడులు చేపడుతోంది. భారతీయులను అక్రమంగా అమెరికా, కెనడాతో పాటు పలు దేశాలకు పంపుతున్న ఏజెంట్లు, కన్సల్టెంట్లు, సంబంధిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు జరుపుతున్నట్లు ఇడి ఓ ప్రకటనలో తెలిపింది. పిఎంఎల్‌ఎ చట్టం కింద మార్చి 1 నుండి ఈ చర్యలు చేపట్టామని, మూడు రాష్ట్రాల్లోనూ సుమారు 29 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి జనవరి, ఫిబ్రవరిల్లోనూ సోదాలు చేపట్టినట్లు తెలిపింది.

నిందితులపై గుజరాత్‌ పోలీసులు దాఖలుచేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి కేసు నమోదు చేసింది. బోగస్‌ లేదా నకిలీ పత్రాలతో 2015 నుండి అక్రమంగా భారతీయ పౌరులను విదేశాలకు పంపుతున్నారని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ పత్రాల కోసం ఒక్కో వ్యక్తి నుండి సుమారు రూ.60 లక్షల నుండి రూ 1.75 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు ఇడి ఆ ప్రకటనలో తెలిపింది. రూ.50.10 లక్షల విలువైన డిపాజిట్లు కలిగిన నిందితుల బ్యాంక్‌ ఖాతాలను కూడా పిఎంఎల్‌ఎ కింద నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

➡️