కేజ్రీవాల్‌ పిఎతో సహా ఆప్‌ నేతల నివాసాల్లో ఇడి సోదాలు

న్యూఢిల్లీ : ఢిల్లీ జల్‌ బోర్డ్‌కు సంబంధించిన కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పిఎతో సహా మరికొంత మంది ఆప్‌ నేతల నివాసాల్లో ఇడి మంగళవారం సోదాలు నిర్వహించింది. కేజ్రీవాల్‌ పిఎ వైభవ్‌కుమార్‌, ఆప్‌ కోశాధికారి, రాజ్యసభ సభ్యులు ఎన్‌డి గుప్తా, ఢిల్లీ జల్‌ బోర్డు (డిజెబి) సభ్యులు శలభ్‌ కుమార్‌ నివాసాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఈ సోదాలు జరిగాయి. డిజెబి చీఫ్‌ ఇంజనీర్‌ జగదీశ్‌ కుమార్‌ ఆరోరా, అనిల్‌ కుమార్‌ ఆగర్వాల్‌లను ఇడి అరెస్టు చేసిన కొన్ని రోజుల తరువాత ఈ సోదాలు జరగడం విశేషం. సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఇడి ఈ కేసును విచారిస్తోంది. రూ.38.02 కోట్ల విలువ చేసే ఓ కాంట్రాక్టుకు సంబంధించి జగదీశ్‌ కుమార్‌ ఆరోరా చేసిన ఆరోపణల ఆధారంగా సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, దాని ఆధారంగా ఇడి దాడులు చేయడం ఇదంతా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమేనని ఆప్‌ నేతలు విమర్శిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో ఎన్‌కెజి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఈ బిడ్‌ను పొందిందని ఇడి ఆరోపిస్తుంది.

భయపెట్టడానికే ఈ సోదాలు : ఆప్‌ మంత్రి

ఆప్‌ నేతల నివాసాల్లో ఇడి సోదాలపై ఢిల్లీ మంత్రి, ఆప్‌ నాయకులు అతిషి సింగ్‌ స్పందించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఇడి సోదాలతో ఆప్‌ నాయకులను భయపెట్టాలని, నోరు మూయించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని విమర్శించారు. బలవంతంగా, బెదిరింపులతో సేకరించిన వాంగ్మూలాలతో ఇడి ఈ కేసును విచారిస్తోందని ఆరోపించారు. ‘మీ బెదిరింపులకు ఆప్‌ భయపడబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బిజెపికి, సిబిఐకి, ఇడికి నేను చెప్పాలనుకుంటున్నాను’ అని అతిషి సింగ్‌ తెలిపారు.

➡️