క్రేజీవాల్‌కు మూడోసారి ఇడి సమన్లు

Dec 23,2023 10:53 #Arvind Kejriwal, #ED notices to

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 3వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు ఇడి సమన్లు జారీ చేయగా.. ఆయన రెండు సార్లూ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఇడి అధికారులు కేజ్రీవాల్‌కు శుక్రవారం సమన్లు పంపారు. తొలుత నవంబర్‌ 2న విచారణకు హాజరు కావాలని ఇడి సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన గైర్హాజరయ్యారు. తరువాత మరోసారి ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినా హాజరుకాలేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే తమ రాజకీయ ప్రత్యర్థుల తరఫున తనకు సమన్లు జారీ అయ్యాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కాగా, బుధవారమే కేజ్రీవాల్‌ 10 రోజుల విపాసన ధ్యాన శిక్షణకు గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఈడీకి బదులిస్తూ.. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. ”రాజకీయంగా ప్రేరేపితమైన సమన్లు ఉపసంహరించుకోవాలి. నేను నిజాయతీతో పారదర్శకంగా జీవిస్తున్నాను. నా జీవితంలో దాచడానికి ఏమీ లేదు. షెడ్యూల్‌ ప్రకారమే నేను విపాసన ధ్యాన కోర్సుకు వెళ్తానని అందరికీ తెలుసు. గత 25 ఏళ్లుగా నేను ఈ కోర్సుకు హాజరవుతున్నా’ అని కేజ్రీవాల్‌ తెలిపారు.

➡️