ఇడికి ఆ అధికారం లేదు

  • ప్రత్యేక కోర్టు విచారణలో ఉంటే అరెస్టు చేయకూడదు
  • సుప్రీం చారిత్రాత్మక తీర్పు

న్యూఢిల్లీ : మనీ లాండరింగ్‌ ఫిర్యాదును ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని సెక్షన్‌ 19 కింద నిందితుడిని ఇడి అరెస్టు చేయలేదని సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పులో పేర్కొంది. ఒకవేళ ఆ నిందితుడి కస్టడీ కావాలని ఇడి భావిస్తే, దానికోసం ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని జస్టిస్‌ అభరు ఎస్‌ ఓఖా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. ”పిఎంఎల్‌ఎలోని సెక్షన్‌ 44 కింద ఫిర్యాదు ప్రాతిపదికగా సెక్షన్‌ 4 కింద శిక్షార్హమైన నేరాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇక ఫిర్యాదులో నిందితుడిగా చూపించిన వ్యక్తిని అరెస్టు చేయడానికి సెక్షన్‌ 19 కింద ఇడి, వారి అధికారులకు అధికారాలు వుండవు. అయినా ఇదే నేరంపై తదుపరి దర్యాప్తులో భాగంగా నిందితుడి కస్టడీ కావాలని ఇడి భావిస్తే, వెంటనే ప్రత్యేక కోర్టుకు ఇడి దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. నిందితుడిని కూడా విచారించిన తర్వాత, కారణాలను నమోదు చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. సెక్షన్‌ 19 కింద నిందితుడిని అరెస్టు చేయకపోయినప్పటికీ కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు జరపాల్సిన అవసరం వుందని కోర్టు భావిస్తేనే కస్టడీకి అనుమతిస్తుంది.” అని బెంచ్‌ తన తీర్పులో పేర్కొంది. నేరాన్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్నప్పటికీ మనీ లాండరింగ్‌ కేసులో నిందితుడు బెయిల్‌ కోసం జంట పరీక్షలను ఎదుర్కోవాలా? లేదా? అనే అంశంపై కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఏప్రిల్‌ 30న ఈ కేసులో తీర్పును సుప్రీం రిజర్వ్‌ చేసుకుని గురువారం వెలువరించింది. ఫిర్యాదు నమోదైన తర్వాత ఒక వ్యక్తిని ఇడి అరెస్టు చేయలేదని జస్టిస్‌ ఓఖా విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెవిన్యూ అధికారుల ప్రమేయం వున్న భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అనేకమంది నిందితులకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ నేపథ్యంలో సుప్రీం ముందుకు ఈ కేసు వచ్చింది.
జనవరిలో సుప్రీం కోర్టు నిందితులకు తాత్కాలిక రక్షణను మంజూరు చేసింది. మనీ లాండరింగ్‌ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయడానికి అదనంగా రెండు షరతులను విధించడంతో 2017 నవంబరులో పిఎంఎల్‌ఎ సెక్షన్‌ 45(1)ని సుప్రీం కోర్టు చెల్లుబాటు కాకుండా చేసింది. అయితే, పిఎంఎల్‌ఎను సవరించిన తర్వాత కేంద్రం మళ్లీ ఆ నిబంధనను తిరిగి పొందుపరిచింది.

➡️