14 కోట్ల ఓటర్లకు గొంతుకే లేదు

effect of mps suspension in parliament

లోక్‌సభలో సస్పెన్షన్ల ఫలితం

రాజ్యసభలోనూ 18 కోట్ల మందికి ప్రాతినిధ్యం లేదు

న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో గత వారం రోజుల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 143 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో కోట్లాది మంది ఓటర్లకు సభలో గొంతుకే లేకుండా పోయింది. సస్పెన్షన్ల పర్వం తర్వాత 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన 14,76,98,507 మంది ఓటర్లకు సభలో ప్రతినిధే లేకుండా పోయాడు. పుదుచ్చేరి, పంజాబ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, అసోం, బీహార్‌, జార్ఖండ్‌, గోవా, జమ్మూకాశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష సభ్యులపై వేటు పడింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకే, ఐయూఎంఎల్‌, జేడీయూ, సీపీఐ(ఎం) నేషనల్‌ కాన్ఫరెన్స్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి. న్యూస్‌ పోర్టల్‌ ‘వైర్‌’ కథనం ప్రకారం ఎగువ సభలో 18,44,83,909 మంది ఓటర్లకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, కర్నాటక, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు రాజ్యసభ నుండి సస్పెండ్‌ అయ్యారు. వీరిలో తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు. సస్పెన్షన్ల అనంతరం ఇప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్‌కు 11 మంది, డీఎంకేకు 7, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 9, జేడీయూకు 6, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సమాజ్‌వాదీ, సీపీఐకి చెందిన ఒక్కొక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. సీపీఐ (ఎం)కు చెందిన ముగ్గురు సభ్యులూ సస్పెండ్‌ అయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్‌కు 12, డీఎంకేకు 5, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 5, జేడీయూకు 2, ఎన్సీపీకి 3, ఆర్జేడీకి 4, సీపీఐ (ఎం)కు 2, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీకి ఒక్కొక్క సభ్యుడు మాత్రమే మిగిలారు. రాజ్యసభలో సీపీఐ (ఎం)కు ఐదుగురు సభ్యులు ఉండగా ముగ్గురిని సస్పెండ్‌ చేశారు.

➡️