ఎన్నికల ఏడాదిలోనూ కార్పొరేట్ల వికాసమే

Feb 2,2024 09:02 #corporates, #elections, #growing, #year
  • మోడీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ నిండా సంస్కరణల జపమే
  • సామాన్యులకు తప్పని విషాదం
  • కీలక సబ్సిడీలకు కోతలు
  • ఆర్భాటంగా సాగిన ఆర్థిక మంత్రి ప్రసంగం

ఎన్నికల ఏడాదిలోనూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల వైపే చూసింది. 2047వ సంవత్సరానికి వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటూ ఆర్భాటంగా సాగిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పేదలకు పెనుభారంగా మారిన ఆర్థిక సంస్కరణల చుట్టూ తిరిగింది. 2024-25 సంవత్సరానికి రూ.47.65 లక్షల కోట్ల అంచనాతో గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ మధ్యంతర బడ్జెట్‌లో మలితరం సంస్కరణలను ప్రారంభించనున్నట్లు మంత్రి అట్టహాసంగా ప్రకటించారు. ‘రీఫామ్‌, పర్ఫామ్‌, ట్రాన్స్‌ఫాం’ పద్ధతిలో వీటిని మరింత సమర్ధవంతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ దిశలో అడుగులు వేసే రాష్ట్రాల కోసం రూ.75 వేలకోట్లను కేటాయించారు. 50 ఏళ్ల కాల వ్యవధితో వడ్డీలేని రుణాన్ని సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయంలోనూ ప్రైవేటుకు పెద్దపీట వేస్తామని చెప్పారు. గతేడాది ప్రకటించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ రాయితీని కొనసాగించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్‌ సాగింది. అదే సమయంలో ఉపాధిహామీ చట్టంతో పాటు, అణగారిన వర్గాలకు ఉద్ధేశించిన ముఖ్యమైన పథకాలకు ఎడాపెడా కోతపెట్టారు. ఆహారం, ఎరువులు, పంటలబీమా, గ్యాస్‌ వంటి వివిధ పథకాలకు ఇచ్చే సబ్సిడీలను కుదించారు. విద్య, వైద్య రంగాల పరిస్థితి అదే! ఆదాయపన్ను రేట్లలో సడలింపులు ఆశించిన వేతన జీవులకు నిరాశే మిగిల్చారు. మహిళల రక్షణకు ఉద్ధేశించిన పథకాల నిధులూ తగ్గిపోయాయి. అంగన్‌వాడీలతో పాటు పోషణ్‌ అభియాన్‌ పథకపు నిధుల్లోనూ కోత పెట్టారు. అధిక ధరలు, పెరుగుతున్న నిరుద్యోగాన్ని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టడానికి బదులుగా మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ప్రతులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలా సీతారామన్‌ దక్కించుకున్నారు.

ధనవంతులను మరింత ధనికులను చేసి పేదలను పీల్చిపిప్పి చేసే బడ్జెట్‌

  • ధనవంతులను మరింత ధనికులను చేసిపేదలను పీల్చిపిప్పి చేసే బడ్జెట్‌సిపిఐ(ఎం)పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 సంవత్సరానికి గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ధనికులను మరింత ధనికులుగా చేసి, పేదలను పీల్చి పిప్పి చేసేదిగా ఉందని సిపిఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని మధ్యంతర బడ్జెట్‌ వెల్లడిస్తున్నదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. దేశంలోని శ్రామిక ప్రజానీకం ఎదుర్కొంటున్న దుర్భర ఆర్థిక పరిస్థితులను ఇది వెల్లడించింది. అలాగే ధనికులను మరింత ధనవంతులుగా చేసి, పేదలను మరింత పేదలుగా మార్చే మోడీ మార్క్‌ ‘అభివృది’్ధ నమూనాను ఇది కళ్లకు కడుతున్నదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. దేశంలోని కొద్ది మంది లాభాలను గరిష్టంగా పెంచడానికి వీలుగా అపార కార్మిక వర్గం జీవనోపాధులను పీల్చి పిప్పి చేస్తున్న మోడీ ప్రభుత్వ దుర్మార్గపు అభివృద్ధి నమూనా అమలుకు ఈ బడ్జెట్‌ ప్రయత్నిస్తోందని విమర్శించింది.

2024-25 సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే (మొదటి పేజీ తరువాయి)బాధ్యత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, 2023 -24 సంవత్సరానికి సవరించిన గణాంకాలు ఆర్థిక వ్యవస్థ వాస్తవిక స్థితిని తెలియజేస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. గత బడ్జెట్‌ అంచనాతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ రాబడి 13.3 శాతం పెరిగింది. అయినప్పటికీ ద్రవ్యలోటు తగ్గించే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలపై భారీగా కోత పెట్టింది. ద్రవ్యలోటు తగ్గించుకోడానికి కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని బడ్జెట్‌ అంచనా కన్నా కిందికి కుదించేసింది. ఈ రంగంలో వ్యయం కేవలం 7 శాతం మాత్రమే పెరిగింది, ప్రభుత్వ వ్యయాన్ని అధికారికంగా చూపిన నామమాత్రపు జిడిపి వద్ధి రేటు 8.9 శాతం కంటే తక్కువే. ఈ వ్యయంలో కోత కారణంగా ప్రజా సంక్షేమానికి సంబంధించిన వివిధ రంగాలపై వ్యయం తగ్గిపోయిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. మూలధన వ్యయం కూడా తగ్గింది. ఇది భవిష్య వృద్ధి, ఆర్థిక మూల సూత్రాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. వ్యయంలోని ఈ క్షీణత ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయిని తాకుతోంది. కోత పడిన వాటిలో వ్యవసాయం , వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, నీటిపారుదల, షెడ్యూల్డ్‌ కులాలు, గిరిజనుల అభివద్ధికి గత బడ్జెట్‌లో ప్రతిపాదించినదాని కంటే తక్కువ ఖర్చు చేశారు. వీటిలో ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన, ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన , పిఎం పోషణ్‌ వంటి పథకాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు గత కేటాయింపుల కంటే తక్కువగా ఉండటమే కాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వ్యయం కన్నా తక్కువగా ఉంది. మహిళా, శిశు సంక్షేమ పథకాల కేటాయింపుల్లో కూడా భారీగా కోత విధించారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం వ్యయంతో పోలిస్తే పంట, ఎరువుల సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పట్టణాభివద్ధికి కేటాయింపులు తగ్గాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీ 60,470 కోట్ల రూపాయలు తగ్గింది. అదే సమయంలో ఎరువులపై సబ్సిడీ రూ.62,445 కోట్లు తగ్గింది. ఉపాధి హామీ పనులకు కేటాయింపు 4806 కోట్ల మేర కోత పడింది. గ్రామీణాభివద్ధి మరియు రాష్ట్రాలకు నిధుల బదలాయింపులో స్తబ్ధత నెలకొంది. నిజానికి దీనిని స్తబ్ధత అనేదానికన్నా ్ప పెరిగిన ద్రవ్యోల్భణాన్ని బట్టి చూస్తే తగ్గిందనే చెప్పాలి.జిఎస్‌టి నష్ట పరిహారానికి అనుగుణంగా గతంలో ఇచ్చిన రుణాల కన్నా మూల ధన పెట్టుబడుల కోసం ఇచ్చిన రుణాలు చాలా వరకు కుదించబడ్డాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసేందుకు దారి తీస్తుంది. కంద్ర ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం ఆదాయాన్ని పెంచడం అనే కథనంతో చాలా బలహీనమైన ఆర్థిక వద్ధి చిత్రాన్ని కప్పిపుచ్చడానికి కేంద్రం ప్రయత్నించిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. 2023-24లో వాస్తవ వద్ధి రేటు 7.3 శాతంగా ఉందని కేంద్రం చెప్పడం పూర్తిగా కల్పితం. పైగా 2023-24లో ద్రవ్యోల్బణం 1.6 శాతం మేర తగ్గిందనేది మరో అసంబద్ధమైన వాదన. ద్రవ్యోల్బణం సూచిక లేదా రిటైల్‌ మార్కెట్‌లోని వినియోగదారు ధర సూచికను బట్టి చూసినా ఇది ఎంత అవాస్తవికమో తేలిపోతుంది. . గత ఆర్థిక సంవత్సరం వినిమయ ధరల సూచి 6 శాతం, ఆహార ద్రవ్యోల్బణం 10 శాతం. ఉంది. అధిక ధరలను అరికట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఫిబ్రవరి 2023 నుంచి రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించడాన్ని బట్టే భారత దేశంలో ద్రవ్యోల్బణం వాస్తవిక గాథ వెల్లడవుతుంది. దేశ ఆర్థికాభివద్ధి మందగించినప్పటికీ, నెమ్మది నెమ్మదిగా పెరిగిన ఆదాయ పంపిణీలో బడా పెట్టుబడిదారులు , వ్యాపారవేత్తలు, సంపన్నులకు లబ్ధి చేకూర్చే ఎటువంటి యత్నాన్ని ప్రభుత్వం వదులుకోలేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం ఈ నిధికి వెళ్తోందని ప్రకటన పేర్కొంది. కార్పొరేట్‌ పన్ను, ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం పెరిగింది. దీనికి కారణం పన్ను రేట్లు పెరగడం కాదు. సంపన్నుల ఆదాయంలో మరింత పెరుగుదల ఫలితంగా జరిగిందే ఇది. దీన్ని ఆర్థికశాస్త్రంలో ఆంగ్ల అక్షరం ‘కె’ ఆకారపు వృద్ధితో పోలుస్తారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో కొద్ది మందిగా ఉన్న కొందరి ఆదాయం వేగంగా పెరుగుతుంది, అదే సమయంలో ఆరుగాల కష్టపడినా వారి బతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం జరుగుతుంది. దీనినే కె ఆకారంపు ఆర్థిక వృద్ధి అంటారు. ఈ అభివద్ధి నమూనాలో, శ్రామిక ప్రజలు సంక్షోభం నేపథ్యంలో తక్కువ వేతనానికి ఎక్కువ పని చేయవలసి వస్తుంది. అభివృద్ధి ప్రక్రియలో కార్మికులను భాగస్వాములను చేస్తూ నిజమైన ‘సామాజిక న్యాయం’ సాధిస్తున్నామంటూ మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని ఈ మధ్యంతర బడ్జెట్‌ బట్టబయలు చేసింది. ‘నిజమైన సామాజిక న్యాయం’ లేదా అభివద్ధిలో సామాన్య ప్రజలను కలుపుకుపోతున్నామని కేంద్రం చెప్పడం ఎంత బూటకమో ఈ బడ్జెట్‌ తెలియజేస్తోంది. మోడీ ప్రభుత్వ అభివద్ధి నమూనా వల్ల దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు జీవనోపాధిని కోల్పోగా, కొద్దిమంది లాభాలకు పడగలెత్తుతున్నారని పొలిట్‌బ్యూరో విమర్శించింది.

ముఖ్యాంశాలు

  • వ్యవసాయ రంగంలో పెరగనున్న ప్రైవేటీకరణ జోరు
  • ఆదాయపు పన్ను యథాతథం,వేతన జీవులకు నిరాశే
  • అణగారిన వర్గాలకుద్దేశించిన ముఖ్యమైన పథకాలకు నిధుల కోత
  • గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సినేషన్‌
  • కోటి కుటుంబాలకు 300 యూనిట్లఉచిత సౌర విద్యుత్‌
  • అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ఆయుష్మాన్‌ పథకం
  • మూడు కొత్త రైల్వే కారిడార్లు.
  • విద్య, ఆరోగ్య రంగాల కేటాయింపుల కుదింపు
  • రాష్ట్రాలకు నిధుల బదలాయింపులో కోత
  • భారత భవిష్యత్‌ను రూపొందించే బడ్జెట్‌ : ప్రధాని మోడీ
  • మధ్యంతర బడ్జెట్‌ అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిని బలోపేతం చేసే హామీ ఇస్తోంది. యువత, పేద, మహిళలు, రైతులు అనే నాలుగు స్తంభాలకు డెవలప్డ్‌ ఇండియా సాధికారతనిస్తుంది. ఇది భారత భవిష్యత్‌ను రూపొందించే బడ్జెట్‌. ఇది యంగ్‌ ఇండియా యువ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్‌లో మొత్తం వ్యయం చారిత్రకంగా రూ.11,11,111 కోట్లకు పెరిగింది. బడ్జెట్‌ 21వ శతాబ్దపు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతోపాటు భారత్‌లోని యువతకు లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది”
  •                                                                                                                                                                                                             అపజయాలను విజయాలుగా పేర్కొనడం వీరి ప్రత్యేకత : శశిథరూర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
  • అపజయాలను విజయాలుగా పేర్కొనడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత. 2015 నుంచి ప్రజల ఆదాయాలు 50 శాతానికిపైగా తగ్గాయి. వారికి ఊరటనిచ్చే అంశం బడ్జెట్‌లో ఒక్కటీ లేదు. ఉపాధి అవకాశాలు లేక 45 శాతం యువత ఇబ్బందిపడుతుంటే దాని గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జిడిపిలో ఎఫ్‌డిఐలు 3.6 శాతం ఉంటే ఇప్పుడు ఒక శాతం కూడా లేవు. మహిళా కార్మికుల ఉపాధి భాగస్వామ్యం క్షీణిస్తుంటే నారీశక్తి గురించి మాట్లాడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది.
  •  బడ్జెట్‌ను ప్రజలు తిరస్కరించారు : డిఎంకె ఎంపీ దయానిధి మారన్‌
  • మోడీ ప్రభుత్వ పాలనలో గత పదేళ్లలో ఏమీ జరగలేదు. దేశంలోని ప్రజలు ఇప్పటికే నిరాశలో ఉన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రజలు తిరస్కరించారు. బ్రిడ్జి కంపెనీలకు తాయిళాలు ప్రకటించారు తప్పితే అర్హులైన వారికి కాదు.
➡️