సైన్యమే ఆశ్చర్యపోయింది : అగ్నిపథ్‌పై మాజీ ఆర్మీ చీఫ్‌ నరవనే

Ex-Army general revives Agnipath debate, says it was ‘bolt from the blue

న్యూఢిల్లీ : అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు సైన్యం ఆశ్చర్యపోయిందని, నౌకాదళానికి, వైమానిక దళానికి ఇది హఠాత్పరిణామంగా, అనూహ్యమైనదిగా అనిపించిందని సైనిక దళాల మాజీ ప్రధానాధికారి జనరల్‌ ఎంఎం నరవనే వ్యాఖ్యానించారు. ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పేరిట ఆయన రచించిన ఓ పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. అందులో ఆయన వివాదాస్పద అగ్నిపథ్‌ పథకాన్ని ప్రస్తావించారు. జనరల్‌ నరవనే 2019 డిసెంబర్‌ 31 నుండి గత సంవత్సరం ఏప్రిల్‌ 30 వరకూ ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించారు. కేంద్రం ఈ పథకాన్ని తానే 2020 ప్రారంభంలో ప్రతిపాదించానని ఆయన తెలిపారు. అయితే కొన్ని నెలల తర్వాత కేంద్రం ప్రకటించిన ఈ పథకం పరిధి పెరిగిందని, త్రివిధ దళాలనూ ఇందులో చేర్చారని వివరించారు. ‘సైన్యంలో ఉన్న మేము ఈ పథకాన్ని గురించి విని ఆశ్చర్యపోయాం. అయితే నౌకాదళం, వైమానిక దళం మాత్రం ఈ హఠాత్పరిణామాన్ని ఎంతమాత్రం ఊహించలేదు. ఇది కేవలం సైన్యానికే పరిమితం చేయాలని తొలుత ప్రతిపాదించానని ఆ రెండు దళాలకు చెప్పాను. ఈ పథకం కింద నియమితులైన వారిలో 75% మందిని సర్వీసులో కొనసాగించి మిగిలిన వారిని విడుదల చేస్తారని అనుకున్నాను’ అని జనరల్‌ నరవనే ఆ పుస్తకంలో రాశారు. కానీ కేంద్రం మాత్రం 25% మందిని కొనసాగించి, మిగిలిన వారిని సాగనంపుతానని ప్రకటించిందని తెలిపారు.

➡️