ఆర్మీ ఛీఫ్‌గా పాండే పదవీకాలం పొడిగింపు

May 26,2024 23:10 #Army, #Extension of Pandey'

న్యూఢిల్లీ : ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించింది. పాండే పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఆయన 25 నెలల పాటు సేవలందించారు. ఛీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా జనరల్‌ మనోజ్‌ సి పాండేని ఒక నెల పాటు అదే పదవిలో కొనసాగించేందుకు అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రటకనలో పేర్కొంది. దీంతో ఆర్మీ రూల్స్‌ 1954లోని రూల్‌ 16 ఎ (4) ప్రకారం ఆయన తన పదవిలో ఈ ఏడాది జూన్‌ 30 వరకు కొనసాగుతారని తెలిపింది. 1982లో కార్పస్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ( ద బాంబే సాప్పర్స్‌) ద్వారా ఆర్మీలో చేరిన పాండే 40 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారు. అత్యంత కీలకమైన అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో సరిహద్దు రక్షణకు సంబంధించిన ఈస్టరన్‌ ఆర్మీ కమాండ్‌గా ఆయన పని చేశారు. 2022లో 12 లక్షల మంది సైనిక బలగానికి అధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.

➡️