ఇండో-పసిఫిక్‌, పశ్చిమాసియా పరిస్థితులపై ఆస్ట్రేలియాలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ చర్చలు

పెర్త్‌ : ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ శుక్రవారం చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల పరిస్థితులపై పెర్త్‌లో జరుగుతున్న రెండు రోజుల సదస్సుకు జైశంకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం, పశ్చిమాసియాలో పరిస్థితులు, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారిరువురు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. హిందూ మహా సముద్ర ప్రాంత దేశాలకు సంబంధించిన పలు అంశాలపై కూడా పరస్పరం అభిప్రాయాలు తెలుసుకున్నామని జై శంకర్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ”సుస్థిర హిందూ మహా సముద్ర ప్రాంతం దిశగా” అన్నది ఈ ఏడాది సదస్సు ప్రధాన అంశంగా వుంది. మొత్తంగా 22 దేశాలకు చెందిన మంత్రులు, ప్రతినిధి బృందాలు ఈ సదస్సులోపాల్గొంటున్నాయి. 16 దేశాలకు చెందిన సీనియర్‌ అధికారుల బృందాలు, ఆరు బహుళపక్ష సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తంగా 400మందికి పైగా సామాజిక, కార్పొరేట్‌నేతలు, విధాన అమలుకర్తలు, మేథావులు, వృత్తినిపుణులు, 40 దేశలా నుండి మీడియా సిబ్బంది హాజరవుతున్నారు. 2016లో తొలుత సింగపూర్‌లో ఈ సదస్సును ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అందరి భద్రత, అభివృద్ధికి ప్రాంతీయ సహకారానికి గల అవకాశాలు(సాగర్‌)పై చర్చించేందుకు ఒక ఉమ్మడి వేదికగా ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయి.

➡️