‘ఢిల్లీ ఛలో’ ఉద్రిక్తం

Feb 14,2024 08:46

రైతులపై నీటి ఫిరంగులు, భాష్పవాయు గోళాలు

బారికేడ్లు, సిమెంట్‌ దిమ్మలతో అడ్డుకునే ప్రయత్నం

రోడ్లపై ఇనుప మేకులు..సరిహద్దుల మూసివేత

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అన్నదాతల ‘ఢిల్లీ ఛలో’ను అడ్డుకోవడానికి కేంద్రంలోని మోడి ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. టిక్రీ మెట్రో స్టేషన్‌ దగ్గరలోని హైవేతో అనుసంధానం కలిగిన గ్రామాలు, వీధుల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలన్నిటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. ఢిల్లీ, హర్యానా మధ్య గల సింఘూ సరిహద్దు వద్ద పెట్టిన బారికేడ్లను తోసుకొని ఢిల్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన రైతులపై పోలీసులు భాష్పవాయు గోళాలను, రబ్బర్‌ బులెట్లను ప్రయోగించారు. ఈ దాష్టీకంలో పలువురు రైతులు గాయపడ్డారు. సిమెంట్‌ దిమ్మెలను రోడ్లకు అడ్డంగా వుంచారు. రైతులను అడ్డుకునేందుకు రోడ్లపై ఇనుప మేకులను అమర్చారు. 144 సెక్షన్‌ను ఇంతకుముందే విధించారు. మూడు జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేశారు. రాజధాని ఢిల్లీకి దారితీసే అన్ని దారులను మూసివేశారు. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు.వీటన్నిటిని అధిగమించి రైతులు రాజధానిలో ప్రవేశించారు.. ఘాజిపూర్‌, సింఘూ బోర్డర్ల వద్ద ట్రాక్టర్లు బారులు తీరాయి. ఘజియాబాద్‌, నోయిడా మార్గంలోనూ అదే పరిస్థితి.

అరెస్ట్‌ చేసిన రైతులను నిర్బంధించేందుకు బావనా స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ప్రభుత్వం తోసిపుచ్చింది.

రోడ్లపై తిరుగాడే హక్కు రైతులకు ఉంది:హైకోర్టు

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఢిల్లీ పోలీసులు మంగళవారం నాడు రైతుల ఢిల్లీ చలోను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు, రోడ్లపై ఇనుక మేకులు, సిమెంటు దిమ్మెలు ఉంచడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌ అయింది. రైతులకు రోడ్లపై తిరుగాడేహక్కు ఉందని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలిపేందుకు స్థలాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది. ఢిల్లీ చలోకు వచ్చిన రైతులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తే చూస్తూ ఊరుకోబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌( బికెయు) చీఫ్‌ రాకేష్‌ టికాయత్‌ హెచ్చరించారు.

‘దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానిది ఒక్కో సమస్య. ఆ సమస్యల పరిష్కారం నిమిత్తం ఢిల్లీ బయలుదేరిన రైతులకు ఇబ్బందులు సృష్టించొద్దు. మేం వారికి దూరంగా లేము. అవసరమైతే వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఇదిలావుండగా ఢిల్లీ ఛలో ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతు ఉందన్న వార్తలను పంజాబ్‌ కిసాన్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌ సింగ్‌ పాంథర్‌ తోసిపుచ్చారు. కనీస మద్దతు ధరపై హడావిడిగా చట్టాన్ని చేయడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా అన్నారు.రైతులతో రెండు దఫాలు చర్చలు జరిగాయని, మరో దఫా చర్చలు బుధవారం ఉదయం జరగనున్నాయని కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి వీడాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు నరేష్‌ తికాయత్‌ కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు కనీస మద్దతు ధర అందించేందుకు చట్టాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. ఇది న్యాయం దిశగా తాము అందిస్తున్న తొలి గ్యారంటీ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. వివరించారు. రైతుల న్యాయమైన డిమాండ్‌ను అంగీకరించాల్సింది పోయి బిజెపి ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని ప్రయోగించడం దారుణమని అన్నారు

➡️