భారత్‌ బంద్‌.. కొనసాగుతున్న రహదారుల దిగ్భందనం

Feb 16,2024 11:48

 న్యూఢిల్లీ :     రైతులు చేపడుతున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే. నిరసనలో భాగంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. పంజాబ్‌లోని చాలా చోట్ల రైతులు రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. రైతుల నిరసన కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. పంజాబ్‌ లోని లూథియానా- సాహ్నేవాల్‌- చండీగఢ్‌ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించారు.

ఈ దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పనులు మూసివేయాలని కోరారు. చాలా చోట్ల హైవేలపై ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు కూడా భారత్‌ బంద్‌ కు మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్‌ బంద్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిఘా పెంచారు. గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లాలో 144 సెక్షన్‌ విధించడంతో పాటు సింగు, తిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

భారత్‌ బంద్‌ ప్రభావంతో దేశంలోని చాలా చోట్ల రహదారులు,  ప్రభుత్వ కార్యాలయాలను  దిగ్బంధిస్తున్నారు. పంజాబ్‌లో మూడు వేల ప్రభుత్వ బస్సుల రాకపోకలను నిలిపివేసింది. అంబులెన్స్‌లు, పెళ్లిళ్ల వాహనాలు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఈ భారత్‌ బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా,  ఆదివారం కేంద్ర ప్రభుత్వంతో నాలుగో రౌండ్‌ చర్చలకు రైతు సంఘాలు అంగీకరించాయి.

➡️