సుప్రీంకోర్టు తీర్పు న్యాయంపై విశ్వాసం కలిగించింది : బృందాకరత్

 న్యూఢిల్లీ :  గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై ప్రతిపక్షాలు స్పందించాయి. సుప్రీంకోర్టు తీర్పు న్యాయంపై కొంత ఆశ కల్పించిందని సిపిఎం నేత బృందాకరత్‌ పేర్కొన్నారు. కేంద్ర, బిజెపి నేతృత్వంలోని గుజరాత్‌ ప్రభుత్వ సామర్థ్యాలను కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎత్తిచూపుతున్నాయని అన్నారు. బిజెపి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్కిస్‌ బానో అవిశ్రాంత పోరాటానికి దక్కిన విజయంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇది న్యాయం సాధించిన విజయమని అభివర్ణించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని అన్నారు. నేరస్తులను పెంచి పోషిస్తుంది ఎవరనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు దేశానికి చాటి చెప్పిందని రాహుల్‌ ఎక్స్‌(ట్విట్టర్‌) లో తెలిపారు. ఆయన సోదరి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు. చివరకు న్యాయం గెలిచిందని   అన్నారు.

గుజరాత్‌ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడానికి బదులుగా దోషులను రక్షించే పనిలో ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఇది చాలా దురదృష్టకరమని గుజరాత్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ దోషి పేర్కొన్నారు. ఇంతటి దారుణమైన నేరానికి గురైన బాధితురాలికి న్యాయం చేయడంలో గుజరాత్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇది బిజెపికి చెంపదెబ్బ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. మహిళా సాధికారిత విషయంలో బిజెపి చేస్తున్న వాదనల్ని ఈ తీర్పు బహిర్గతం చేసిందని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు.

2002 గుజరాత్‌ అల్లర్లలో ఐదు నెలల గర్భవతి అయిన బిల్కిస్‌ బానోపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుమార్తె సహా ఏడుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన సంగతి తెలిసిందే. 11 మంది దోషులకు సిబిఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 1న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా వారి శిక్షను సమర్థించింది. అయితే గుజరాత్‌ ప్రభుత్వం వారికి రెమిషన్‌ (శిక్షా కాలం తగ్గింపు) మంజూరు చేస్తూ 2022 ఆగస్ట్‌ 15న విడుదల చేసింది.

➡️