మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి

  • నలుగురు పోలీసు కమాండోలు, ఒక జవానుకు గాయాలు
  • కాల్పుల ఘటనను ఖండించిన సీఎం బీరేన్‌ సింగ్‌

ఇంఫాల్‌: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోరే పట్టణంలో ఈ ఉదయం జరిగిన ఆకస్మికదాడిలో నలుగురు పోలీసు కమాండోలు, సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన జవాను తీవ్రంగా గాయపడ్డారు. తౌబల్‌ జిల్లా లిలాంగ్‌ చింగ్‌జావో ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్‌ ఈస్ట్‌, ఇంఫాల్‌ వెస్ట్‌, కాక్చింగ్‌, బిష్ణుపూర్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.ఈ క్రమంలో మయన్మార్‌ సరిహద్దుకు సమీపంలో భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఇందులో భాగంగా సరిహద్దు పట్టణమైన మోరేకు పోలీసు కమాండోలు వాహనాల్లో వెళుతున్నారు. ఈ సమయంలో ముష్కరులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆకస్మికంగా కాల్పులు జరిపారు. నలుగులు పోలీసులు ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గాయపడ్డారు. గాయపడిన భద్రతా సిబ్బందికి అస్సాం రైఫిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనను సీఎం బీరేన్‌ సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఉపేక్షించబోమని, నిందితులు ఎంతటివారైనా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కాగా, ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.

➡️