హమాస్‌తో చర్చల నిలిపివేతపై స్పందించిన ఇజ్రాయిల్ ప్రధాని

Feb 18,2024 12:04 #israel hamas war, #Netanyahu

 టెల్‌ అవీవ్‌ :    హమాస్‌తో చర్చల నిలిపివేతపై ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ విజ్ఞప్తి మేరకు ఇజ్రాయిల్‌ హమాస్‌తో సంధి చర్చల కోసం కైరోకు ప్రతినిధులను పంపిన సంగతి తెలిసిందే. అయితే గత మంగళవారం నుంచి చర్చలు స్తంభించిపోయాయి. ఈ అంశంపై శనివారం ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. హమాస్‌ డిమాండు అసంబద్ధంగా ఉన్నాయని, అందుకే చర్చలను నిలిపివేశామని అన్నారు.

యుద్ధం నిలిపివేయడంతో పాటు గాజాను హమాస్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారని, అలాగే ఇజ్రాయెల్‌ జైల్లో ఉన్న వందలాది హంతకులకు విడిచిపెట్టాలని కోరారని అన్నారు.  జెరూసలెంలో వివాదాస్పదంగా ఉన్న పవిత్ర స్థలంపైనా అసంబద్ధ డిమాండ్లు చేస్తున్నారని అన్నారు. హమాస్‌ డిమాండ్లలో ఎలాంటి మార్పు కనిపించలేదని అన్నారు. దీంతో వారితో తాము చర్చలను కొనసాగించమని అన్నారు. పాలస్తీనా స్వతంత్ర హోదాపై అంతర్జాతీయ ఆదేశాలకు లొంగదని  అన్నారు.  పాలస్తీనా గుర్తింపు అంశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.  ఒకవేళ అలా జరగాలంటే ఎలాంటి షరతులు లేకుండా ఇరు పక్షాల మధ్య చర్చలతోనే సాధ్యపడాలన్నారు.

అయితే సంధి చర్చలు నిలిచిపోవడానికి ఇజ్రాయిలే కారణమని హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే ఆరోపించారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ ఉపసంహరణ, పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు. ఈ చర్చలకు ఈజిప్టు, ఖతర్‌  మధ్యవర్తిత్వం వహించాయి. కానీ, ఇజ్రాయెల్‌ మరోమారు చర్చలకు వెళ్లకపోవటంతో మంగళవారం నుంచి అవి నిలిచిపోయాయి.

➡️