ఎవరినీ నొప్పించాలని భావించలేదు : టిఎంసి ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ

న్యూఢిల్లీ   :   ఉపరాష్ట్ర్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ పట్ల తనకు చాలా గౌరవం వుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ బుధవారం పేర్కొన్నారు.  మిమిక్రీ అనేది ఓ కళ అని, ఎవరినీ నొప్పించాలని భావించలేదని అన్నారు. తనకు రాజ్యసభ చైర్మన్‌ పట్ల గౌరవం వుందని అన్నారు.

” రాజ్యసభ, లోక్‌సభ అనే విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం పార్లమెంటు అనుకరణ మాత్రమే జరిగింది. ఇది ఆయనను బాధపెట్టినట్లు భావిస్తే.. నేనేం చేయలేను. ” అని అన్నారు. వాస్తవంగా రాజ్యసభలో ధన్‌ఖర్‌ ఆవిధంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. 2014-2019 మధ్య కాలంలో ప్రధాని మోడీ కూడా లోక్‌సభలో మిమిక్రీ చేశారని, కానీ ఆ విషయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదని అన్నారు. ఆ వీడియో కూడా ఉందని చెప్పారు.

మంగళవారం పార్లమెంట్‌ వెలుపల టిఎంసి ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ జగదీప్‌ ధన్‌ఖర్‌ను అనుకరిస్తుండగా.. రాహుల్‌ గాంధీ వీడియో తీసిన ఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖర్‌ సహా ప్రధాని మోడీ ఖండించారు.

➡️