కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత : రాహుల్‌ గాంధీ

Mar 8,2024 11:05 #MSP, #Rahul Gandhi

జైపూర్‌ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, గ్రాడ్యుయేషన్‌ తరువాత యువకులకు ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్‌లో రూ. లక్ష వరకూ చెల్లిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించేలా చట్టం తీసుకొస్తామన్నారు. భారత్‌్‌ జోడో న్యారు యాత్రలో భాగంగా రాజస్థాన్‌లోని బనస్వరా వద్ద జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్‌ ఈ హామీలు ఇచ్చారు. యువతకు ‘ఐదు న్యాయాలు’ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయడం, శాశ్వత ఉద్యోగాలు, నియామక పరీక్ష పత్రాల లీక్‌లు లేకుండా చూడ్డం, గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత, 40 ఏళ్ల లోపు యువకులకు స్టార్టప్‌ ఫండ్‌ అనే వాగ్దానాలు చేశారు. అలాగే వాగ్దానాలను కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని రాహుల్‌ స్పష్టం చేశారు. అలాగే కుల గణన చేయాల్సిన అవసరాన్ని రాహుల్‌గాంధీ మరోసారి ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, భారత్‌ జోడో న్యారు యాత్ర గురువారంతో గుజరాత్‌లోకి ప్రవేశించింది. దహోద్‌ జిల్లాలోని జాలోద్‌ పట్టణంలోకి చేరడంతో గుజరాత్‌లోకి యాత్ర ప్రవేశించినట్లయింది. ఇక్కడ జరిగిన సభలో కూడా మాట్లాడుతూ రాహుల్‌ బిజెపిపై విమర్శలు గుప్పించారు.

➡️