ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు వద్దే దొంగల చేతివాటం.. కట్‌ చేస్తే.. సీన్‌ రివర్స్‌..!

న్యూఢిల్లీ : ఇద్దరు దొంగలు ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఒకడు మెడలో చైన్‌ ను పట్టుకుపోగా, వేరొకడు ఆ వ్యక్తి చేతికి చిక్కాడు.. తీరా చూస్తే… ఆ వ్యక్తి ఎవరో కాదు… ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు..! ఇంకేముంది ఇద్దరు దొంగలూ కటకటాలు లెక్కపెట్టారు..!

వినోద్‌ బడోలా ఒక ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. ఆయన ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్నారు. వినోద్‌కు వృత్తిపరంగా మంచి పేరు ఉంది. అనేక ఉగ్రకార్యకలాపాలను అడ్డుకున్నారు. ఆయన ధైర్య సాహసాలకు రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. అయితే … సాయంత్రపు నడకకు వెళ్లిన ఆయనపై అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఒకరు వినోద్‌ ముఖంపై దాడి చేయడంతో వెంటనే ఆయన కిందపడిపోయారు. ఆ వెంటనే మరొకరు ఆయన మెడలో ఉన్న గొలుసును లాగేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంతలోనే తేరుకున్న వినోద్‌ చాకచక్యంగా ఒకడిని పట్టుకున్నారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్‌ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు తాను బంధించిన దొంగని అప్పగించారు. ఆ తర్వాత వారితో కలిసి పారిపోయిన వ్యక్తిని కూడా పట్టుకున్నారు. వీరిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. వారి చరిత్ర అంతా బయటపడింది. వారు పలు కేసుల్లో నిందితులు అని పోలీసులు గుర్తించారు. ఇంకేముంది… ఆ దొంగలు కటకటాల ఊచలు లెక్కపెట్టారు.

➡️