కృష్ణజన్మభూమి వివాదం .. సర్వేకు అనుమతించిన అలహాబాద్‌ హైకోర్టు

ప్రయాగ్‌రాజ్‌ :    యుపిలోని మథురలో 17వ శతాబ్దానికి చెందిన షాహి ఈద్గా మసీదుపై సర్వే చేపట్టేందుకు అలహాబాద్‌ హైకోర్టు గురువారం అనుమతించింది. సర్వేను పర్యవేక్షించేందుకు ఓ న్యాయవాదిని కమీషనర్‌గా నియమించనున్నట్లు తెలిపింది. అయితే కమిషనర్‌ నియామకం, సర్వే విధివిధానాలను సోమవారం ప్రకటిస్తామని కోర్టు పేర్కొంది.

కృష్ణుని జన్మస్థలంలో మసీదుని నిర్మించారని, సర్వే చేపట్టాల్సిందిగా హిందూ వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.    హిందూసేనకు చెందిన విష్ణు గుప్తా సర్వే చేపట్టాలంటూ గతేడాది డిసెంబర్‌లో స్థానిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.   శతాబ్దాల నాటి మసీదుని గతంలో అక్కడ ఉన్న కత్రా కేశవ్‌ దేవ్‌ ఆలయాన్ని కూల్చివేసి నిర్మించారని, వివాదంలో ఉన్న 13.37 ఎకరాల భూమిపై పూర్తి హక్కులు తమకు అప్పగించాలని కోరుతూ మధుర కోర్టులో హిందూ వర్గం పిటిషన్‌ దాఖలు చేసింది. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశించినట్లు వారు ఆరోపించారు. మసీదు గోడలపై ఉన్న తామరపువ్వులు, హిందూ పురాణాల ప్రకారం శేష్‌నాగ్‌ని పోలి ఉన్నాయని ఉన్నాయని, వాటిని సాక్ష్యాలు గా పేర్కొన్నాయి. దీంతో దేవాలయాన్ని కూల్చి మసీదుని నిర్మించినట్లు స్పష్టమైందని తెలిపాయి.

అయితే  ఈ సర్వేను వ్యతిరేకిస్తూ ముస్లిం వర్గాలు హైకోర్టుని ఆశ్రయించాయి.   1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనాస్థలం అయినా అదే మతపరమైన హోదాను కొనసాగించాలన్న 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ.. ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ముస్లింలు కోర్టును కోరాయి.     హైకోర్టు తీర్పుపై ముస్లిం వర్గాలు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.

➡️