మంటెత్తించిన మార్చ్‌

Apr 11,2024 00:03 #sun stroke, #sunburn
  • అత్యంత ‘ఉష్ణమయ మార్చి’గా రికార్డు

న్యూఢిల్లీ : ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి నెల నుంచే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే గత నెల మార్చి చరిత్రలోనే అత్యంత ‘ఉష్ణమయ మార్చి’గా నిలిచిపోయింది. గడచిన 1.25 లక్షల ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయి వేడి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరవులు, కార్చిచ్చు, వరదలకు ఇదే కారణమని భావిస్తున్నారు. అలాగే, గత 174 ఏళ్లలో గత ఏడాది 2023 అత్యంత ఉష్ణమయ ఏడాదిగా నిలిచింది. 2024లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గత ఏడాది జూన్‌ నుంచి వరుసగా పదో నెలలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన కొత్త రికార్డు నమోదైంది.
ఎల్‌నినో వాతావరణ పోకడ, మానవచర్యలతో ఉత్పన్నమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులే ఇందుకు కారణం. యూరప్‌ చెందిన కోపర్‌నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం గత నెల మార్చిలో పుడమిపై సరాసరి ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్‌ ఉంది. పారిశ్రామికీకరణకు ముందునాటి కాలం (1850-1900)తో పోలిస్తే ఇది 1.68 డిగ్రీల సెల్సియస్‌ అధికం. 1991- 2020 కాలంలో మార్చి నెలల్లో నమోదైన వేడితో పోలిస్తే ఇది 0.73 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ. ఇప్పటివరకూ మార్చికి సంబంధించి అధిక ఉష్ణోగ్రతలు 2016లో నమోదయ్యాయి. ఈ ఏడాదితో పోల్చినా ఈ ఏడాది మార్చిలో 0.10 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువగా నమోదైంది. అలాగే, గత 12 నెలల్లో (2023 ఏప్రిల్‌ నుంచి గత నెల మార్చి వరకూ) పుడమి సరాసరి ఉష్ణోగ్రతలో రికార్డు చోటుచేసుకుంది. ఇది.. 1991-2020 కాలంలో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత కన్నా 0.70 డిగ్రీల సెల్సియస్‌ అధికం. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ఇది 1.58 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువ. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేయాలని ‘పారిస్‌ ఒప్పందం’లో ప్రపంచ దేశాలు నిర్దేశించకున్నాయి. అయినా జనవరితో ముగిసిన ఏడాది కాలం మొత్తం ఈ పరిమితి దాటిపోయింది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ఇప్పటికే పుడమి సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగింది.

➡️