కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం లేదు

Apr 10,2024 23:53 #Canada, #India

న్యూఢిల్లీ : భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజ్జర్‌ హత్యపై, కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకుందంటూ ట్రూడో ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని తాజాగా ఆ దేశ దర్యాప్తులో వెల్లడైంది. ఎన్నికల్లో భారత్‌ ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టమైంది.
కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలపై ట్రూడో ప్రభుత్వం ఓ స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తునకు సంబంధించి కీలక విషయాలు తాజాగా బయటికొచ్చాయి. కెనడా రాజకీయాల్లో భారత్‌ ఎలాంటి జోక్యం చేసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైంది. 2021 నాటి ఎన్నికలను ప్రభావితం చేసేలా భారత్‌ ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆ ఎన్నికలను పర్యవేక్షించిన సీనియర్‌ అధికారి కమిషన్‌కు వెల్లడించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని సదరు అధికారి చెప్పినట్లు తెలిపింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు కమిషన్‌ ఎదుట జస్టిన్‌ ట్రూడో బుధవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2019, 2021లో కెనడాలో జరిగిన జాతీయ ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ విజయం సాధించింది.

➡️