దిగజారిన ‘పారదర్శక’ సూచిక

Feb 1,2024 09:01 #Corruption, #India Rank
/india-slips-eight-places-in-global-corruption-ranking-scores-39-out-of-100
  • 8 స్థానాలు పడిపోయిన భారత్‌ ర్యాంక్‌ 
  • కనుమరుగవుతున్నపౌర స్వేచ్ఛ
  • ప్రాథమిక హక్కులకు విఘాతం
  • ప్రపంచ అవినీతి సూచిక వెల్లడి

న్యూఢిల్లీ : 2022తో పోలిస్తే పారదర్శకత విషయంలో భారత్‌ సూచిక ఎనిమిది స్థానాలు దిగజారింది. దాని స్కోరు ఒక పాయింట్‌ పడిపోయింది. 2023వ సంవత్సరానికి సంబంధించిన ‘ప్రపంచ అవినీతి అవగాహన సూచిక’ను స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ మంగళవారం విడుదల చేసింది. ఈ సూచిక మొత్తం 180 దేశాల్లోని అవినీతిని పరిగణనలోకి తీసుకోగా వాటిలో భారత్‌కు 93వ ర్యాంక్‌ లభించింది. 2022తో పోలిస్తే ఈ ర్యాంక్‌ ఎనిమిది స్థానాలు దిగజారింది. 2022లో భారత్‌ ర్యాంక్‌ 85. ఇక స్కోరు విషయానికి వస్తే 2022లో 40గా ఉన్న స్కోరు గత సంవత్సరంలో 39కి పడిపోయింది. అత్యంత అవినీతిమయమైన దేశానికి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ‘0’ ర్యాంక్‌ ఇస్తుంది. అవినీతి అసలే లేని దేశానికి 100వ ర్యాంక్‌ ఇస్తుంది. అంటే 0-100 మధ్య ర్యాంకులు ఉంటాయన్న మాట. భారత్‌తో పాటు మాల్దీవులు, కజక్‌స్థాన్‌, లెసోథో దేశాలకు 93వ ర్యాంక్‌ లభించింది. భారత్‌ స్కోరులో హెచ్చుతగ్గులు ఉన్నాయని, కాబట్టి గణనీయమైన మార్పు వచ్చిందని నిర్ధారణకు రాలేకపోయామని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ తెలిపింది. అయితే భారత్‌లో పౌర స్వేచ్ఛ కనుమరుగు అవుతోందని, టెలీకమ్యూనికేషన్‌ బిల్లు ఆమోదంతో ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడిందని వివరించింది. దేశ భద్రతా ప్రయోజనాలను సాకుగా చూపుతూ టెలికం సేవలపై కేంద్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా పెత్తనాన్ని కట్టబెట్టేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు.

‘ఇది ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ఎన్నికల ఏడాది. బంగ్లాదేశ్‌, భారత్‌, ఇండొనేషియా, పాకిస్తాన్‌, సోలోమన్‌ దీవులు, దక్షిణ కొరియా, తైవాన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2023లో అవినీతిని అదుపు చేయడంలో పెద్దగా పురోగతి సాధించలేదు’ అని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ నివేదిక తెలిపింది. డెన్మార్క్‌ దేశం (స్కోరు 80) వరుసగా ఆరో సంవత్సరం సూచికలో ప్రథమ స్థానం పొందింది. ఫిన్లాండ్‌, న్యూజిలాండ్‌, నార్వే, సింగపూర్‌ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సోమాలియా, వెనెజులియా, సిరియా, దక్షిణ సూడాన్‌, యమన్‌ దేశాలు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. సూచికలో అంతర్జాతీయ సగటు స్కోరు వరుసగా 12వ సంవత్సరం 43 వద్ద నమోదైంది. మూడింట రెండు వంతులకు పైగా దేశాలు 50 పాయింట్ల కంటే తక్కువ స్కోరు పొందాయి.

➡️