కేరళపై ఇంత నిర్లక్ష్యమా ?

Jan 21,2024 08:11 #carelessness, #kerala
  • కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ప్రజానీకం
  • లక్షలాది మందితో 651 కిలోమీటర్ల మానవహారం

తిరువనంతపురం/న్యూఢిల్లీ బ్యూరో : కేరళ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న శతృత్వ వైఖరిని నిరసిస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన లక్షలాది మంది ప్రజలు శనివారం మానవహారం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్తర ప్రాంతం చివరలో ఉన్న కాసర్‌గోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి దక్షిణాన చివరన ఉన్న తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌ వరకూ 651 కిలోమీటర్ల పొడవున నిర్వహించిన మానవహారంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ముక్తకంఠంతో నిరసించారు. మానవహారం ఏర్పడడానికి ముందు జరిగిన భారీ బహిరంగ సభను సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ ప్రారంభించారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కాసర్‌గోడ్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా జరిగిన సభను డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు ఎఎ రహీం ప్రారంభించారు.

డివైఎఫ్‌ఐ తొలి జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిన సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఇపి జయరామన్‌ రాజ్‌భవన్‌ సమీపంలో మానవహారం చివరన నిలబడ్డారు. మానవహారం కార్యక్రమానికి వివిధ జిల్లా కేంద్రాల్లో డివైఎఫ్‌ఐ జాతీయ, రాష్ట్ర నాయకులు నేతృత్వం వహించారు. మానవహారంలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజలు సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు ఒకేసారి ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ‘కేంద్రం నిర్లక్ష్యాన్ని మనం సహించాల్సిన అవసరం ఉన్నదా?’ అనే నినాదంతో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు, నియామకాలపై కేంద్రం విధించిన నిషేధం, కేరళపై కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు వంటి అంశాలు ఈ మానవహారంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సాంస్కృతిక నేతలు, విద్యార్థి సంఘాల కార్యకర్తలతో పాటు పది లక్షలకు పైగా యువత ఈ మానవహారంలో భాగస్వామి అయింది.

కేంద్రం వివక్షపై ఫిబ్రవరి 8న ఢిల్లీలో కేరళ సిఎం, ప్రజా ప్రతినిధుల ధర్నా

              కేరళ రాష్ట్రాన్ని, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, బిజెపియేతర రాష్ట్రాల పట్ల వివక్షను నిరసిస్తూ కేరళలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డిఎఫ్‌) ఆధ్వర్యాన ఫిబ్రవరి 8న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా రాష్ట్ర మంత్రులు, ఎల్‌డిఎఫ్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలు పాల్గొంటారు. కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకుంటోందని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుందని ఎల్‌డిఎఫ్‌ విమర్శించింది. ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఇపి జయరాజన్‌ కాంగ్రెస్‌, ఇతర యుడిఎఫ్‌ భాగస్వామ్య పార్టీలను ధర్నాలో పాల్గొనవలసిందిగా అభ్యర్థించగా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యుడిఎఫ్‌) తిరస్కరించింది. ధర్నాలో పాల్గొనకూడదని యుడిఎఫ్‌ నాయకత్వం ఏకగ్రీవంగా నిర్ణయించిందని ప్రతిపక్ష నేత విడి సతీశన్‌ తెలిపారు. ప్రతిపక్ష నేత సతీశన్‌, ప్రతిపక్ష ఉపనేత, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌) నాయకుడు పికె కున్హాలికుట్టితో కేంద్రం దుర్మార్గ వైఖరిపై సిఎం పినరయి విజయన్‌ చర్చలు జరిపారు. అయినప్పటికీ కాంగ్రెస్‌, యుడిఎఫ్‌ ముందుకు రాలేదు. యుడిఎఫ్‌ నిర్ణయంపై కేరళ రాజకీయ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

➡️