అటవీరాష్ట్రంలో బిజెపికి చుక్కెదురేనా?

Apr 14,2024 23:40 #chance for BJP, #forest state

– రైతుల ఆగ్రహం
– కార్పొరేట్ల దోపిడీని ప్రతిఘటిస్తున్న ఆదివాసీలు
– లక్ష్యం చేసుకొని మరీ ఎన్‌కౌంటర్లు
– ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో పోలింగ్‌
అటవీరాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. అఖిల భారత స్థాయిలో ఇండియా ఫోరం ఏర్పడినప్పటికీ కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడల వలన ఆ పార్టీకి నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ ముందుకు వెళుతోంది. మొత్తం 11 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత ఏప్రిల్‌ 11న ఒకస్థానానికి, ఏప్రిల్‌ 26న 3 స్థానాలకు, మే7న ఏడు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 9, కాంగ్రెస్‌ రెండు సీట్లను సాధించాయి. ప్రధానంగా రిజర్వుడ్‌ స్థానాలపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. 11 లోక్‌సభ స్థానాల్లో ఆరు జనరల్‌ ఐదు రిజర్వ్‌డ్‌ స్థానాలున్నాయి. నాలుగు ఎస్టీ, ఒక ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
మావోయిస్టుల ప్రభావం
మావోయిస్టుల ప్రభావమున్న ‘బస్తర్‌’ నియోజకవర్గం తొలిదశ పోలింగ్‌కు సిద్ధమౌతోంది. రాష్ట్రంలో మావోయిస్టులు, నక్సలైట్ల ఏరివేత దిశగా పనిచేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ‘మావోయిస్టు నిర్మూలన ఆపరేషన్‌’ కింద పోలీసులను, భద్రతా బలగాలను అడవుల్లో మొహరింపజేసి, భారీ కూంబింగ్‌లు నిర్వహించి, కనిపించిన మావోయిస్టులను కాల్చిపడేస్తోంది. ఈ చర్యతో మావోయిస్టులకు, పోలీసుల మధ్య కాల్పులు అధికమయ్యాయి. అటవీ ప్రాంతం అధికంగా కలిగిన బస్తర్‌ స్థానంలో ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం ఉంటుంది.
ధాన్యం రైతుల ఆగ్రహం
రాష్ట్రంలో వరి రైతుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. కాంగ్రెస్‌ ‘రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ యోజన’ పథకం ద్వారా ధాన్యానికి మద్దతు ధర కంటే రూ.600 బోనస్‌ ఇచ్చి క్వింటాకు రూ.2600 చెల్లించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ రూ.3200, బిజెపి రూ.3100 ధర చెల్లిస్తామంటూ హామీలిచ్చాయి. రైతులకు మద్దతు ధరకు మించి బోనస్‌ ఇచ్చే రాష్ట్రాల్లో ధాన్యం సేకరణకు పరిమితులు విధిస్తామని కేంద్రం హెచ్చరించడంతో బిజెపి ప్రభుత్వం ఈ హామీని పక్కనపడేసింది. ఈసారి అదే హామీని అమలు చేస్తామంటున్న బిజెపి మాటలు ప్రజలు నమ్మేట్లులేరు.

అదానీ దోపిడీపై ఆదివాసీల పోరు
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 54 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 35 స్థానాలు, జిజిపి ఒక సీటును గెలిచాయి. బిజెపి 46.28 శాతం, కాంగ్రెస్‌ 42.19 శాతం ఓట్లను సాధించాయి. కొత్త అభ్యర్థులను ఎంచుకోవడం ద్వారా బిజెపి లాభపడింది. సీనియర్‌ నాయకుల్లో అంతర్గతపోరు, అక్రమాలు కాంగ్రెస్‌ను పీడిస్తున్నాయి. ఇటీవల బిజెపి హయాంలో హస్టియో జిల్లాలో వేల ఎకరాల్లో అడవులు కోతకు గురయ్యాయి. మైనింగ్‌, అదానీ పవర్‌ ప్రాజెక్ట్‌ల కోసం 30,000లకు పైగా చెట్లను నరికివేయడంతో దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు నిరసించారు. అడవుల నరికివేత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్యాసింజర్‌ రైళ్లు నడపడంలో నిర్లక్ష్యం వంటి మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌కు పట్టున్న గిరిజన ఓట్లను హిందుత్వ ఎజెండాతో బిజెపి తమవైపు ఆకర్షించేందుకు నానా గడ్డి కరుస్తోందన్న విమర్శలున్నాయి.

➡️