సొరేన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి-ఇడికి జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశం

May 28,2024 23:47 #jharkhand high court, #The order

రాంచి : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని జార్ఖండ్‌ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జనవరి 31న సొరేన్‌ను ఇడి అరెస్టు చేసింది. తన బెయిల్‌ పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలని కోరుతూ సోమవారం హైకోర్టులో సొరేన్‌ పిటిషన్‌ వేశారు. సోరెన్‌ తరపు వాదనలు వినిపిస్తూ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, రాజకీయ కుట్రకు జెఎంఎం నేత బలయ్యారని విమర్శించారు. దీంతో సొరేన్‌ అభ్యర్థనపై సమాధానం చెప్పాల్సిందిగా కోర్టు, ఇడిని ఆదేశించింది. తదుపరి విచారణా తేదీని జూన్‌ 10గా నిర్ణయించింది.
8.5ఎకరాల భూ కుంభకోణంలో ఏ పత్రాల్లోనూ తన పేరు ఎక్కడా లేదని, పైగా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కూడా నేరం నమోదు కాలేదని సోరెన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమి తనదంటూ కొందరు వ్యక్తులు చేసిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ఇడి ఈ చర్యలకు దిగిందని చెప్పారు. ఆ భూమి యజమాని రాజ్‌ కుమార్‌ పహాన్‌ తన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని సొరేన్‌ పేర్కొంటున్నారు. పహాన్‌ తన పేరును ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. అయినా ఇడి ఆ భూమి తన ఆధీనంలో వుందని పేర్కొంటూ కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు.

➡️