టిబి మందులు అందుబాటులో ఉంచండి

May 1,2024 00:29
  •  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి తపన్‌సేన్‌ లేఖ

న్యూఢిల్లీ : టిబి ఔషధాలను ప్రజలందరికీ అందుబాటులో వుండేలా చూడాల్సిందిగా కోరుతూ సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయకు ఒక లేఖ రాశారు. కార్మికులు ప్రధానంగా అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, వారి కుటుంబ సభ్యుల నుండి ఇందుకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోని టిబి చికిత్సా కేంద్రాల్లో ఈ ఔషధాలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రైవేటు మందుల వ్యాపారుల ధన దాహానికి బలయ్యే అవకాశాలు వున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, కేంద్రాల్లో ఈ మందులు లభ్యం కాకపోవడం, మరికొన్నిచోట్ల కొరత పెరిగిపోవడంతో ఈ వ్యాధి బారినపడిన రోగులు మందులు తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన వీటిని బయట కొనలేక, ఆపేయడంతో ఈ ఇన్ఫెక్షన్‌ బాగా వ్యాప్తి చెందే పరిస్థితులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా మందులు తీసుకోలేకపోవడం, పైగా చికిత్సను ఆపేయడంతో రోగుల పరిస్థితి దారుణంగా తయారవుతోందన్నారు. అయినా ప్రభుత్వం ఈ సమస్య తీవ్రతను గుర్తించడం లేదని, ఇందుకు సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన టిబి నిర్మూలనా కార్యక్రమంలో మన దేశం కూడా అంతర్భాగమైనందున ఇటువంటి పరిస్థితి నెలకొనడం వల్ల ఈ కార్యక్రమంలో తీవ్రమైన లోపాలు, లొసుగులు వున్నాయని అర్థమవుతోందని తపన్‌సేన్‌ పేర్కొన్నారు. 2023లో భారత్‌లో 25.55 లక్షలు కొత్త టిబి కేసులు నమోదయ్యాయని, అందులో 1.43 లక్షల మంది చిన్నారులే వున్నారని, ప్రభుత్వ డేటాను బట్టే ఈ విషయాలు తెలుస్తున్నప్పుడు ఈ విషయంలో నిరాసక్తత పనికిరాదని తపన్‌సేన్‌ స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో టిబి నిర్మూలనా అధికారులు ఇప్పటికే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ లేఖలు రాసిన విషయాన్ని తపన్‌సేన్‌ గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు

➡️