పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక 

Dec 21,2023 08:38 #kerala, #Urban Development
kerala cabinet approved urban develoment

అర్బన్‌ పాలసీ కమిషన్‌ ఏర్పాటుకు కేరళ కేబినెట్‌ నిర్ణయం

తిరువనంతపురం : కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వం పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్బన్‌ పాలసీ కమిషన్‌ను ఏర్పాటుకు బుధవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన జరిగిన కేబినేట్‌ సమావేశం నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 25 ఏళ్లలో కేరళ అభివృద్ధి కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసేందుకు సమగ్ర పట్టణ పాలసీని రూపొందించడానికి ఈ అర్బన్‌ పాలసీ కమిషన్‌ కృషి చేయనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో పట్టణ జనాభా 48.50 శాతంగా ఉంది. 2035 నాటికి కేరళ 92.8 శాతం పట్టణీకరణ రాష్ట్రంగా మారుతుందని జాతీయ జనాభా కమిషన్‌ అంచనా వేసింది. కాగా, అర్బన్‌ పాలసీ కమిషన్‌కు ఇంగ్లండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్‌ యూనివర్శిటీలో సీనియర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం. సతీష్‌ కుమార్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కోచి మేయర్‌ ఎం అనిల్‌ కుమార్‌, పట్టణ ప్రణాళిక నిపుణులు, అహ్మదాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీలో మాజీ ఫ్యాకల్టీ ఇ నారాయణన్‌ కో-ఛైర్‌పర్సన్లుగా ఎంపికయ్యారు. స్థానిక స్వపరిపాలన శాఖ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీలో పట్టణ ప్రణాళిక రంగానికి చెందిన నిపుణులు కూడా ఉంటారు. ఈ కమిషన్‌ పదవీ కాలం ఒక ఏడాది. ఈ అర్బన్‌ కమిషన్‌ ఏర్పాటుతో దేశంలో సొంత పట్టణ విధానాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించనుంది.

➡️