కె-స్మార్ట్‌ను ఆవిష్కరించిన కేరళ

Jan 2,2024 08:54 #introduced, #K-Smart, #kerala

కొచ్చి : కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కె-స్మార్ట్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం ప్రారంభించారు. కొచ్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కె-స్మార్ట్‌ యాప్‌ను విజయన్‌ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇటువంటి యాప్‌ను దేశంలోనే తొలిసారిగా కేరళలో రూపొందించారు. రాష్ట్రంలో వివిధ పట్టణాల్లో కూడా కె-స్మార్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. కొచ్చిలో ప్రారంభోత్సవం సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ ‘కె-స్మార్ట్‌ యాప్‌తో స్థానిక స్వపరిపాలన సంస్థలు అందించే సేవలన్నీ ఒకే ఫ్లాట్‌ఫారమ్‌లో డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాయి’ అని తెలిపారు. ఈ యాప్‌తో ముఖ్యంగా 40 లక్షల మంది ప్రవాస కేరళీయులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.. ఇది ఒకే క్లిక్‌తో స్థానిక సంస్థలకు చెందిన అన్ని సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తుందని అన్నారు. కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని తరగతులకు చెందిన ప్రజలందరూ కూడా అధునిక సాంకేతికత వృద్ధిని వినియోగించుకునే విధంగా అడుగులు వేస్తోందని, రాష్ట్రంలో దాదాపు 45 వేల తరగతి గదులను హైటెక్‌గా మార్చడమే ఇందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రి విజయన్‌ గుర్తు చేశారు. అలాగే 2023లో అన్ని పంచాయితీల్లో ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ లోకల్‌ గవర్నెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా దాదాపు 250 సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ వ్యవస్థతో ఏడాదికి సుమారు ఒక కోటి ఫైళ్లపై నిర్ణయాలు తీసుకోవచ్చనని ముఖ్యమంత్రి తెలిపారు. పబ్లిక్‌ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై ప్రాజెక్టు అయిన కె-ఫీలో భాగంగా ఇప్పటి వరకూ 2 వేలకు పైగా హాట్‌స్పాట్లను గుర్తించామని తెలిపారు.

➡️