ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా నిర్దోషి

-ఆయనతో పాటు మరో ఐదుగురు కూడా నిర్దోషులే

-బొంబాయి హైకోర్టు తీర్పు

-సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర ప్రభుత్వం

-పదేళ్ల పోరాటం తరువాత న్యాయం: ప్రొఫెసర్‌ సాయిబాబా భార్య వసంత కుమారి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నయన్న కేసులో 90 శాతం అంగ వైకల్యం ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబాతో పాటు మరో ఐదుగుర్ని బంబాయి హైకోర్టు (నాగపూర్‌ ధర్మాసనం) నిర్దోషులుగా ప్రకటించింది. 54 ఏళ్ల సాయిబాబాతో పాటు మరో ఐదుగురు మహేష్‌ తిర్కి, హేమ్‌ మిశ్రా, పాండు నారోట్‌, విజరు తిర్కి, ప్రశాంత్‌ రహీని 2017 మార్చిలో సెషన్స్‌ కోర్టు దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును జస్టిస్‌ వినరు జోషి, జస్టిస్‌ వాల్మీకి ఎస్‌.ఎ మెనిజేస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం పక్కన పెట్టింది.నిందితులపై ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైయిందని, ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయిందని ధర్మాసనం పేర్కొంది. యుఎపిఎ కింద నిందితుల్ని బుక్‌ చేయాలని చేసిన వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. రూ.50 వేల పూచీకత్తుపై నిందితులను విడుదల చేయాలని ధర్మాసనం తెలిపింది.

మరోవైపు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంసుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ 2014లో 90 శాతం వైకల్యంతో వీల్‌ చైర్‌ కు పరిమితమైన సాయిబాబా, మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. 2017 మార్చిలో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు.. నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పూర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సెషన్స్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2022 అక్టోబర్‌ 14న వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 అక్టోబర్‌ 15న విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం నిందితుల విడుదలపై స్టే విధించింది.

సుదీర్ఘ విచారణ తరువాత, 2023 ఏప్రిల్‌ 19న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సిటి రవికుమార్‌ లతో కూడిన ధర్మాసనం హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తీర్పును పక్కన పెట్టి, ఈ కేసును మొదటి నుంచి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బంబాయి హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నేడు తీర్పు వెలువరించింది. కాగా.. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్శిటీ సస్పెండ్‌ చేసింది. 2021 మార్చి 31న ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించింది. పదేళ్ల పోరాటం ఫలించింది: ప్రొఫెసర్‌ సాయిబాబా భార్య వసంత కుమారిపదేళ్ల పోరాటం తరువాత తమకు న్యాయం జరిగిందని ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా భార్య వసంత కుమారి అన్నారు. తన భర్త ప్రతిష్టను ఎప్పుడూ పణంగా పెట్టలేదని అన్నారు. ఈ న్యాయ పోరాటంలో సాయిబాబాకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

➡️