కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు

2011 నుంచి ఇచ్చిన ఒబిసి సర్టిఫికేట్లు రద్దు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరొక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. ఒబిసిలో పలు క్లాసులను కొట్టివేసింది. 2011 తర్వాత నుంచి అంటే మమతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఒబిసి ధ్రువపత్రాలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
2012 పశ్చిమబెంగాల్‌ ఒబిసి చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒబిసి వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టంచేసింది.
అందువల్ల 2011 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఒబిసి జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ క్లాసులతో జారీ అయిన ఒబిసి ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది.

తీర్పుపై మమతా అసహనం..
హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహం వ్యక్తంచేశారు. ఈ తీర్పును అంగీకరించమని తెలిపారు. ”ఒబిసి రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇప్పుడు బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నింది. ఈ తీర్పును మేం అంగీకరించం. ఒబిసి రిజర్వేషన్లు కొనసాగుతాయి” అని మమతా స్పష్టంచేశారు.

➡️