భూహక్కులు కల్పించాల్సిందే : గ్రేటర్‌ నోయిడాలో రైతుల పోరాటం పున:ప్రారంభం

Jan 31,2024 10:49 #farmers, #Greater Noida, #Land rights
  • వేలాదిగా చేరుకున్న అన్నదాతలు

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ : వేలాదిమంది రైతులు యోగి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. భూహక్కులు కల్పించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ నోయిడా ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జిఎన్‌ఐడిఎ) కార్యాలయం ఎదుట రైతులు మళ్లీ పోరాటాన్ని ప్రారంభించారు. గ్రేటర్‌ నోయిడా ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జిఎన్‌ఐడిఎ) లిఖితపూర్వక హామీని అమలు చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఇతర డిమాండ్‌లతో అథారిటీ గత ఏడాది సెప్టెంబర్‌ 16న లిఖితపూర్వక ఒప్పందం చేసుకుంది. అయినప్పటికీ, గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోలేదు.సర్కిల్‌ ధరల సవరణ, అధిక పరిహారం, భూ నిర్వాసితులకు 40 చదరపు మీటర్ల ఇళ్ల స్థలాలు, బాధిత కుటుంబాలకు ఉపాధి, 10% అభివృద్ధి చేసిన భూములు తిరిగి ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు ప్రకటించారు. సాగుదారులకు భూమిపై హక్కు కల్పించడంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని విమర్శించారు. యోగి ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు ఎంపీ, ఎమ్మెల్యేలు, బిజెపి నాయకులను గ్రామాల్లోకి రానివ్వబోమని ప్రకటించారు. పోరాటాన్ని ఉద్దేశించి ఎఐకెఎస్‌ నాయకులు పి కృష్ణప్రసాద్‌, సమాజ్‌ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌ భట్టి, కాంగ్రెస్‌ నాయకులు అజరు చౌదరి, ఎఐకెఎస్‌ సభ్యుడు పుష్పేంద్ర త్యాగి, సికెసి సభ్యుడు, డాక్టర్‌ రూపేష్‌ వర్మ తదితరులు మాట్లాడారు. వేలాదిమంది మహిళలు, యువకులు పాల్గొన్నారు. నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తామని రైతులు తెలిపారు. రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని అన్నదాతలు కోరారు.

➡️