ప్రతిపక్షాల మాట వినడం మోడీ డిఎన్‌ఎలోనే లేదు : కపిల్‌ సిబాల్‌

Jun 11,2024 23:45 #Kapil Sibal, #speech

భగవత్‌ మాటనైనా వినండి
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల మాట వినడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఎన్‌ఎలోనే లేదని కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌ విమర్శించారు. కనీసం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మాటలనైనా వినాలని సూచించారు. ఏడాదికి పైగా మణిపూర్‌లో హింసాకాండ కొనసాగడంపై భగవత్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కపిల్‌ సిబాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బిజెపి ప్రభుత్వంలో జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ‘మేం మణిపూర్‌ ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాం. మీరు కనీసం రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను కూడా తొలగించలేకపోయారు. ఇక ముఖ్యమంత్రి గురించి ఏమి చేస్తారు’ అని కపిల్‌ సిబాల్‌ అన్నారు. ప్రతిపక్షాల స్వరాన్ని కూడా వినాలని, అప్పుడే దేశం ముందుకు వెళుతుందని చెప్పారు. జమ్ముకాశ్మీర్‌లో బస్సుపై ఉగ్రదాడి విషయంలోనూ మోడీ ప్రభుత్వంపై కపిల్‌ సిబాల్‌ విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేసిందని, దాని ఫలితం ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసి ఐదేళ్లు గడిచిపోయినా జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితి అలాగే ఉందని అన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరుగుతాయని చెప్పారని, కానీ ఇంకా జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదని గుర్తు చేశారు. మూడుసార్లు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినంత మాత్రాన…. మోడీకి, జవహర్‌లాల్‌ నెహ్రూకు మధ్య ఎలాంటి పోలికలు లేవని అన్నారు. నెహ్రూజీ ఆలోచనా విధానం మోడీకి ఎన్నటికీ రాదని అన్నారు. మోడీ రెండుసార్లు బిజెపి ప్రధానమంత్రిగానూ, మూడోసారి ఎన్‌డిఎ ప్రధానిగానూ ప్రమాణస్వీకారం చేశారన్నారు.

➡️